Post Office | రామగిరి, జనవరి 8 : రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీలో ఉన్న పోస్టాఫీస్నుఎత్తివేసేందుకు అధికారులు నిర్ణయించడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేపట్టక తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు సెంటినరీకాలనీ పోస్టాఫీస్ ఎదుట పలువురుగురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ పోస్టాఫీస్ ద్వారా అనేక మంది ఖాతాదారులు లావాదేవీలు నిర్వహిస్తున్నారని, కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు, వికలాంగులు పెన్షన్లు పొందేందుకు, ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఈ కార్యాలయంపై పూర్తిగా ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు.
గత 16 ఏళ్లుగా ఈ పోస్టాఫీస్ సింగరేణి భవన్లో కొనసాగుతుండగా, విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ఈ కారణంగా సంబంధిత విద్యుత్ సంస్థ అధికారులు గత ఆరు నెలలుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారని ఆరోపించారు. దీనిపై పోస్టల్ అధికారులు సరైన స్పందన చూపకపోవడం విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ పోస్టాఫీస్‌లో పొదుపు చేసిన అనేక మంది ఖాతాదారులకు చెందిన దాదాపు రూ.40 లక్షల మేరకు నిధులు సంబంధిత పోస్టల్ అధికారి కాజేసిన ఘటనపై ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని నిరసనకారులు ఆరోపించారు.
ఈ సమస్యలు పరిష్కరించకుండా, ఇప్పుడు కొత్తగా పోస్టాఫీస్‌ను ఇక్కడి నుంచి ఎత్తివేయడానికి కుట్రలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు కీలకమైన ఈ పోస్టాఫీస్‌ను యథాతథంగా కొనసాగించాలని, తక్షణమే సమస్యలకు పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన లో సర్పంచ్ లు పల్లె ప్రతిమ పీవీ రావు, మహేష్, ఉప సర్పంచ్ ప్రవళిక, నాయకులు ముల్మూరి శ్రీనివాస్, పూర్ణచందర్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.