మంథని, మే 18: పెద్దపల్లి దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణ అంటే చిన్నచూపెందుకు? అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో వార్డు మెంబర్ నుంచి మొదలుకొని ఎమ్మెల్యే, ఎంపీల వరకు ప్రతి ఒక్కరినీ అందరూ గౌరవించాల్సిందేనన్నారు. ఆదివారం మంథనిలోని రాజగృహలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారిని అవమాన పరుస్తున్నారని ఆరోపించారు. నలభై ఏండ్లపాటు ఎమ్మెల్యేగా పని చేసిన దుద్దిళ్ల కుటుంబం, దళితులను, బహుజనులను అవమానాలకు గురి చేస్తున్నదన్నారు. పెద్దపల్లి ఎంపీగా దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు వంశీకృష్ణ ఉంటే అతనిపై శ్రీధర్‌బాబు అనేక రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అడుగడుగునా అవమానాలు చూపించడమే కాకుండా సదరు ఎంపీ సామాజిక వర్గానికి చెందిన వారితో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయించి తిట్టించడం చాలా బాధాకరమైన విషయమన్నారు. తాను ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా ఉన్న సమయంలో శ్రీధర్‌బాబు చాలా సార్లు అవమానపర్చారని ఆవేదన చెందారు.
తన పేరు కూడా తీయడానికి అతను ఇష్టపడలేదని గుర్తు చేశారు. ఎంపీ వంశీకృష్ణ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కానీ రాజ్యాంగానికి లోబడి ఎంపీగా గెలిచిన వారిని గౌరవించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఈ కోణంలోనే తాను ఇలాంటి అప్రజాస్వామిక వ్యవస్థను ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల సందర్భంగా ప్రభుత్వ పరంగా దేవాదాయ శాఖ ద్వారా అన్ని పత్రికల్లో అడ్వైర్టెజ్మెంట్లు వేయించారని, అందులో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ వంశీకృష్ణ ఫొటోను వేయకుండా అవమాన పరిచారన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ మంత్రుల భారీ కటౌట్లు ఏర్పాటు చేసి వారి కాళ్ల కింద అమ్మవారి ఫొటోలను పెట్టుకొని అవమాన పరిచారన్నారు. ఎంపీకి జరిగిన అవమానంపై లోక్ సభ స్పీకర్, సెక్రెటరీ, అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు.
ఎంపీ ఫొటోను ప్రభుత్వ ప్రకటనలో వాడకుండా అవమాన పరిచిన ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడంతో పాటు విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు. మంథనిలో ప్రజాసామ్యాన్ని అవమానపర్చుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య పోరాటానికి శ్రీకారం చుట్టినట్టు స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, ఆరెపల్లి కుమార్, ఎస్కే యాకుబ్, మాచీడి రాజుగౌడ్, జంజర్ల శేఖర్, కనవేన శ్రీనివాస్, పెగడ శ్రీనివాస్, ఎరుకల రవి పాల్గొన్నారు.