చిగురుమామిడి, మార్చి 21: అఖిలభారత కమిటీ పిలుపు మేరకు ఆశా కార్యకర్తలు మండలంలోని ఆరోగ్య కేంద్రాల(Health centers) వద్ద కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ప్లే కార్డ్స్ ప్రదర్శించి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాల డిమాండ్లు పరిష్కరించాలని వారు కోరారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీలత మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనాలు నెలకి రూ.26 వేలు నిర్ణయించి, పెన్షన్, సామాజిక భద్రత ప్రయోజనాలను కల్పించాలన్నారు.
బడ్జెట్లో నిధులు కేటాయించాలని, దేశవ్యాప్తంగా ఒకే విధమైన పని పరిస్థితులు అమలు చేయాలని కోరారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవు, 20 రోజుల క్యాజువల్ సెలవులు, వైద్య సేవలను తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్, పెన్షన్ ప్రకటించే వరకు పదవి విరమణ ఉండరాదని, సీనియార్టీ ప్రాతిపదికన ఆశా వర్కర్లకు ఏఎన్ఎంగా అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు రంగవేణి శారద, లక్ష్మి, పద్మ, లత, రజిత, సుజాత, స్వప్న, ప్రియాంక, శంకరమ్మ, భాగ్యలక్ష్మి, రజియా బేగం, రాజమణి తదితరులు పాల్గొన్నారు.