కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు బీఎల్వోలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం.. ప్రజలు, ఓటర్లకు అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం వెరసి సర్ పక్రియలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ పక్రియ మొదలై పది రోజులు దాటినా ఓటర్లకు పత్రాలు అందించలేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతోపాటు ఆ ఫారం నింపి ఇవ్వడంలో కూడా వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికార యంత్రాంగం చెబుతున్నా.. సరైనా ప్రచారం లేకపోవడంతో ఓటర్లలో గందరగోళం కనిపిస్తున్నది.
కరీంనగర్ కార్పొరేషన్, జూలై 7: సర్ పక్రియలో భాగంగా ప్రతి ఓటరుకు బీఎల్వోలు రెండు పత్రాలను అందించాల్సి ఉంది. ఈ రెండు పత్రాలను ఓటరు నింపి ఒక పత్రానికి తన వద్ద ఉంచుకొని మరో పత్రాన్ని బీఎల్వోకు అందించాలి. అయితే ఒక పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్ల అడ్రస్‌లు సుదూర ప్రాంతాల్లో ఉండడంతో ఓటరు పత్రాలు అందించేందుకు బీఎల్వోలు అవస్థలు పడుతున్నారు. గతంలో ఒకచోట ఓటు నమోదైన ఓటర్లు.. ప్రస్తుతం వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. కొంత మంది వేరే నియోజకవర్గాల్లో.. వేరే జిల్లాల్లో.. వేరే రాష్ర్టాల్లోనూ నివసిస్తున్నారు. పెళ్లిళ్లు అయి వెళ్లిపోయారు. ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లారు.
ఇలా ఎంతో మంది వేర్వేరు ప్రాంతాల్లో ఉంటుండగా.. ఇటువంటి వారికి పత్రాలు ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు చూస్తే కరీంనగర్‌లోని గోదాంగడ్డ పోలింగ్ బూత్ పరిధిలో రాంనగర్, విద్యానగర్ అడ్రస్సులకు చెందిన ఓటర్లు ఉండడంతో వారికి ఎలా పత్రాలు ఇవ్వాలన్న సమస్యలు వస్తున్నాయి. ఒకే కుటుంబానికి వేర్వేరు పోలింగ్ బూత్‌లు కేటాయించడం వంటి పొరపాట్లు ఉన్నాయి. దీంతో ఈ సవరణల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లకు కూడా తమ ఓటు ఏ పోలింగ్ బూత్‌లో వచ్చాయో తెలుసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. నగరంలోని అనేక మంది బీఎల్వోల వద్ద తమ పోలింగ్ బూత్ పరిధిలోకి రాని ఇంటి నంబర్లకు చెందిన ఓటర్ల పత్రాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయని తెలుస్తున్నది.
తప్పుల తడకలు
బీఎల్వోలు పంపిణీ చేస్తున్న దరఖాస్తు పత్రాల్లో ఇంటి నంబర్లు తప్పుగా ముద్రించడం, తండ్రి పేరుకు బదులు ఇంటి పేరు రాయడం, తండ్రి పేరు వద్ద కుటుంబ సభ్యులపేర్లు రావడం, ఇతరత్రా తప్పిదాలు వస్తున్నాయని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటిని సవరించేందుకు ఏ మేరకు అవకాశం ఉంటుందన్న విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆధార్ కార్డు నంబర్ ఇవ్వడం ఆప్షన్‌గా పేర్కొన్న బీఎల్వోలు మాత్రం తప్పనిసరిగా ఆధార్ నంబర్ వేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న ఓటరు పత్రాల్లో అడ్రస్సును మార్చుకోవాలన్న విషయంలో బీఎల్వోలు, ఇతర అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఓటర్లు పేర్కొంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.
2002లో ఓటరు వెతకడం ఓ సమస్య
అయితే ఈ పక్రియలో 2002లో ఓటరుగా ఎక్కడ ఉందన్న విషయాన్ని ఆన్లైన్లో వెతకడం ఓటర్లకు ఓ సవాల్‌గా మారుతున్నది. ఓటరు తమపేరు నమోదు చేసి ఆన్లైన్లో సర్చ్ చేస్తే ఒక్కొక్కసారి ఒక్కో తీరులో చూపిస్తున్నది. 2002లో ఓటరుగా ఎక్కడ ఉందో వెతికే విషయంలోనూ అనేక మంది ఓటర్లకు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. మరోవైపు మహిళ ఓటర్ల విషయంలో 2002లో పుట్టింటి పేరుతో ఓటరుగా ఉన్నా.. తల్లిదండ్రుల వివరాలను ఇచ్చి ఇప్పుడు అత్త ఇంటి పేరుతో ఇస్తుండడం వల్ల తమ ఓటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాగం ఓటర్లకు అన్ని విధాలుగా సహకారాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నా.. వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఓటర్లకు అందించే విషయంలో ఆ స్థాయి ప్రచారం కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు ఓటర్లకు మరింతగా అవగహన కల్పించాల్సినా అవసరం ఎంతైనా ఉన్నది.