Dharmaram | ధర్మారం, జనవరి 23: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో కరీంనగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కరీంనగర్ రీజినల్ మేనేజర్ ఆదేశానుసారం నాబార్డ్ సౌజన్యంతో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యత అవగాహనపై కళాజాత ప్రదర్శన నిర్వహించారు. రాజమహేంద్రవరం విభూతి బ్రదర్స్ కళాజాత బృందం వీధి నాటిక ప్రదర్శన, జానపద గీతాలు మ్యాజిక్ షో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక బ్రాంచ్ లలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు బ్యాంకు అనేక స్కీం లను అమలు చేస్తుందని కళాకారులు వివరించారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష, అటల్ పెన్షన్ యోజన పథకం, బాలిక సుకన్య సమృద్ధి యోజన పథకం, ఎన్పీఎస్ వాత్సల్య ,ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ తదితర పథకాలు బ్యాంకులో అమలు చేస్తున్నట్లు వారు వివరించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే వారికి ఓటిపి చెప్పవద్దని వారు సూచించారు. వాట్సాప్ కు ఏపీకే ఫైల్స్ బ్లూ రంగులో ఉండే యాప్ ను ప్రెస్ చేయవద్దని, ఆన్లైన్ యాప్ లను డౌన్లోడ్ చేయవద్దని కళాకారులు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూర రజిత వెంకటేశం, వార్డు సభ్యులు, దొంగతుర్తి తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రాహుల్, సిబ్బంది పాల్గొన్నారు.