ధర్మపురి, జనవరి 10: ముక్కోటి ఏకాదశి వేడుకలకు ధర్మపురి నర్సన్న క్షేత్రం ముస్తాబవుతున్నది. శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారి దేవాలయంలో ఈ నెల 13న ఏకాదశి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు, రాజగోపురాలతో పాటు అన్ని దేవాలయాలకు విద్యుత్ దీపాలు, పూలదండలతో అలంకరణ చేసి, టెంట్లువేసి, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు సరిపడా లడ్డూ, పులిహోర ప్రసాదాలను అదనంగా తయారు చేయించనున్నామన్నారు. భక్తులకు ప్రత్యేక దర్శనం, సాధారణ దర్శన క్యూ లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు..
ముక్కోటి ఏకాదశి పూజలు..
ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 13న గురువారం ప్రాతఃకాలం 2.30 గంటలకు లక్ష్మీసమేత యోగ, ఉగ్ర నరసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాములవారి మూలవిరాట్టులకు మహా క్షీరాభిషేకాలు, నివేదన, మంత్ర పుష్పం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రాతఃకాలం 4గంటలకు వైకుంఠద్వారం వద్ద పుష్పవేదికపైన ఆసీనులై ఉన్న మువ్వురు స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్రనామార్చనలు, నివేదనలు, సప్తహారతుల సమర్పణ, మంత్రపుష్పం, అనంతరం వేదఘోష, మహదాశీర్వచనం ఉంటుంది. ప్రాతఃకాలమున 5 గంటలకు మంగళవాయిద్యాలు వెంటరాగా వేద మంత్రోచ్ఛారణల నడుమ ధర్మపురి శ్రీమఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ మహాస్వామి, గుంటూరుకు చెందిన దత్త పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ చేతుల మీదుగా వైకుంఠ ద్వారం దర్శన పూజ నిర్వహిస్తారు. అనంతరం వైకుంఠ ద్వారం తెరిచి, ద్వారం ద్వారా భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. వేడుకల సందర్భంగా ఉదయం 7 నుంచి ఉదయం 11గంటల వరకు శేషప్ప కళావేదికపై భక్తి సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ స్వామి వార్లను దర్శించుకోవాలని కోరారు.