CPI national leader Chada Venkata Reddy | కోరుట్ల, సెప్టెంబర్ 5: తెలంగాణ రైతు సాయుధ పోరాట ఉత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో శుక్రవారం పార్టీ జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈనెల 11 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో ఎర్ర జెండాలు ఎగురవేసి పార్టీ చరిత్రను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందే సీపీఐ అవిర్భావించిందన్నారు.
భూమి కోసం, భుక్తి కోసం బానిస సంకెళ్ల విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో 4500 మంది అసువులు బాశారన్నారు. లక్షల ఎకరాల భూమి పేదలకు పంచామని, 8000 గ్రామాలను రజాకార్ల చెర నుంచి విముక్తి పొందయన్నారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబ్ హైదరాబాద్ సంస్థానం తెలంగాణలో విలీనం చేశారన్నారు. పార్టీ పోరాట చరిత్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ పోరాట చరిత్రను హిందూ ముస్లీంలుగా వక్రీకరిస్తుందని విమర్శించారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, సహయ కార్యదర్శి ఎరుగురాల భూమేశ్వర్, మాజీ జిల్లా కార్యదర్శి వెన్న సురేష్, ఎర్దండి భూమయ్య, జిల్లా నాయకులు సుతారి రాములు, మహమ్మద్ మౌలాన, ముక్రం, మహమ్మద్ ఉస్మాన్, కొక్కుల శాంత, ఎన్నం రాధ, మాడిశెట్టి కిరణ్, కొండ రాజయ్య, శనిగారపు ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.