కలెక్టరేట్, మార్చి 210 : విదేశీ విశ్వ విద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిది పథకం(Ambedkar Overseas Education Fund) కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ధి సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఎం నగైలేశ్వర్ తెలిపారు. షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహిస్తున్న ఈ పథకం ద్వారా షెడ్యుల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు రూ. 20 లక్షలు స్కాలర్ షిప్ అందించే క్రమంలో యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, తదితర దేశాల్లోని విశ్వ విద్యాలయములల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో చదవాలసుకుంటున్న ఎస్సీ విద్యార్థులు దరఖాస్థులు చేసుకోవాలని సూచించారు.
సంవత్సర ఆదాయము రూ.5.00 లక్షలకు మించకుండా ఉండాలని, పి.జి చదవడానికి డిగ్రీలో 60% కంటే ఎక్కువ మార్కులు కలిగి ఉండి, TOEFL/IELTS/GRE/GMAT అర్హత కలిగి ఉండాలన్నారు. పాస్ పోర్ట్, వీసా కలిగి ఉండి, విదేశీ విశ్వ విద్యాలయము నందు అడ్మిషన్ పొంది ఉన్న వారు మాత్రమే అర్హులని తెలిపారు. కుటుంబం నుండి ఒక్కరు మాత్రమే ఈ పథకము ద్వారా ఉపకారవేతనం పొందేందుకు అర్హులని గురువారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. ఔత్సాహికులు ఈనెల 30 నుండి ఏప్రిల్ 19 వరకు www.telangana.epass.cgg.gov.in అనే వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అప్లోడ్ చేయాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు రెండు విడతల్లో రూ.20 లక్షలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.