Pawan Kalyan | జగిత్యాల : కొండగట్టు ఆంజనేయస్వామి ఒకరి సొత్తు కాదని, సర్వంతర్యామి కలిగిన మహిమాన్విత ప్రదేశమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ అన్నారు. ఆయన టీటీడీ చైర్మన్ నాయుడు మంత్రి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే సత్యంతో కలిసి కొండగట్టు ఆంజేనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత ఇక్కడి దేవాదాయ శాఖ అధికారులు భక్తుల సౌకర్యార్థం పలు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తనకు విన్నవించగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో కొండగట్టులో రూ.35.19 కోట్లతో పనులు చేపట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఆమోదించిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే రూ.3.84 కోట్లతో 2200 మంది ఒకేసారి దీక్షణ విరమణ విరమించేలా మండపం ఏర్పాటు చేయడంతో పాటు భక్తులు బస చేసేందుకు 96 గదులతో ధర్మశాలను రూ.31.35 కోట్లతో నిర్మించేందుకు స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నాయుడుతో కలిసి పనులను ప్రారంభించామన్నారు. గిరి ప్రదక్షణకు తన వంతుగా సహకారం అందిస్తానని, ఆంజనేయుడు అంటే రాముని భక్తుడని రాముని కార్యాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్తానని తనవంతుగా సహకరిస్తానని అన్నారు.
కొండగట్టు అంజన్న ఆలయాన్ని ప్రస్తుతం చేపడుతున్న పనులతో పాటు మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. కొండగట్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నిధుల మంజూరుకు ప్రత్యేక కృషి చేసిన కృషిచేసిన ఆనంద్ సాయి, మహేందర్ రెడ్డి, గోవింద హరిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.