కరీంనగర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. చారిత్రక దళితబంధు పథకం దిగ్విజయంగా అమలవుతున్నది. ఇప్పటికే హుజూరాబాద్ సెగ్మెంట్‌కు సంబంధించి వందలాది మందికి వాహనాలు అందించగా, మంగళవారం మరో 270 యూనిట్లను సర్కారు గ్రౌండింగ్ చేసింది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదికగా పంపిణీ జాతరలా సాగింది. 20.72 కోట్ల విలువైన హార్వెస్టర్లు, జేసీబీలు, వ్యాన్లు అందించగా, లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. కూలీనాలి చేసుకుని బతికే తమ బతుకులను తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జేజేలు పలుకడమేకాదు నిండునూరేళ్లు చల్లంగ ఉండాలని దళితలోకం దీవిస్తున్నది.
దళిత బంధు పథకం దిగ్విజయంగా అమలవుతున్నది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా యూనిట్ల గ్రౌండింగ్ జరుగుతున్నది. ఇప్పటికే వేలాది మందికి మంజూరు చేయగా, మంగళవారం కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియం వేదికగా రూ.20.72 కోట్ల విలువైన 270 వాహనాలను వ్యక్తి గత యూనిట్ల కింద పంపిణీ చేశారు. ఇందులో ఎక్కువగా ట్రాలీ ఆటోలు, మినీ వ్యాన్లు, ప్యాసింజర్ ఆటోలు ఉన్నాయి. కొందరు లబ్ధిదారులు రెండేసి యూనిట్లు పెట్టుకున్నారు. కొందరు నాలుగు పాడి గేదెలు తీసుకుని, ఒక ట్రాలీ ఆటో కొనుక్కున్నారు.
ప్రతి రోజూ పాలు ఆటోలో తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కొందరు టెంట్ హాజ్ పెట్టుకుని దానికి అనుబంధంగా ట్రాలీ ఆటోలు తీసుకున్నారు. ఆయా శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఈ సారి వాహనాలు పంపిణీ చేశారు. వీరిలో కొందరు మినీ వ్యాన్లు తీసుకున్నారు. వారు పని చేస్తున్న శాఖల్లోనే వాహనాలను లీజుకు నడుపుకుంటామని చెబుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం దళితుల కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపాలనే లక్ష్యంతో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ప్రణాళికా బద్ధంగా యూనిట్లను ఎంపిక చేస్తూ, పంపిణీ చేస్తున్నారు.
దళితుల జీవితాల్లో వెలుగులు
కరీంనగర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): దళితులు, బడుగు బలహీనవర్గాల ఆర్థిక ఎదుగుదలే సీఎం కేసీఆర్ లక్ష్యమని, వారి జీవితాల్లో వెలుగులు నింపి వారి కండ్లలో ఆనందం చూసేందుకు బృహత్తర దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. మంగళవారం బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారులకు 20.72 కోట్ల విలువైన 270 వ్యక్తిగత యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో దళిత బంధు యూనిట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
దళిత జాతి పైకి రావాలని, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కాళ్లపై వారు నిలబడాలని ఆనాడు అంబేద్కర్, జ్యోతిరావుపూలె, జగ్జీవన్ రామ్ ఎన్నో కలలుగన్నారని, ఆ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని ప్రశంసించారు. ఒక్క రూపాయి కూడా బ్యాంకు లోన్ లేకుండా, తిరిగి చెల్లించనవసరం లేకుండా లబ్ధిదారుల అకౌంట్లలో నేరుగా 10 లక్షలు వేస్తున్నారని వివరించారు. దళితులు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ఏది కావాలంటే దానినే యూనిట్‌గా మార్చి ఇప్పిస్తున్న ఏకైన రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని పునరుద్ఘాటించారు. లబ్ధిదారులకు ఇష్టమైన హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోలు కొనుక్కునేందుకు కేసీఆర్ గొప్ప అవకాశాన్ని కల్పించారని, నిన్నటి వరకు ఇదే వాహనాలపై డ్రైవర్లుగా పనిచేసిన వాళ్లు ఇపుడు వాటికి ఓనర్లుగా మారడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
వాహనాలు, ముఖ్యంగా వ్యాన్లు కొనుగోలు చేసుకున్న వారికి ప్రభుత్వం తరపునే ఉపాధి కల్పించే ఆలోచన చేస్తున్నామని, సివిల్ సప్లయ్స్ గోదాముల నుంచి బియ్యం రవాణాకు దళిత బంధు వ్యాన్లను వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ను మంత్రి కోరారు. ఈ విధంగా ప్రభుత్వ సంస్థలు, శాఖల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాహనాలను సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టి సీఎం కేసీఆర్ విత్తనాలు వేశారని, ప్రతి లబ్ధిదారుడు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వృక్షాలుగా మారాలని ఆకాంక్షించారు.
జగ్జీవన్ లాంటి గొప్ప వ్యక్తుల పుట్టిన రోజు సందర్భంగా ఇంత పెద్ద మొత్తంలో యూనిట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న హుజూరాబాద్‌లోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లోనూ 100 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, వాళ్ల అకౌంట్లలోనూ డబ్బులు పడుతున్నాయని వెల్లడించారు. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, నెహ్రూ యువకేంద్ర కో ఆర్డినేటర్ సంపత్ ఉన్నారు.
టెంట్ హౌజ్ కం ట్రాలీ ఆటో..
ఈ చిత్రంలో కనిపిస్తున్న తల్లీకొడుకుల పేర్లు గూడెపు లక్ష్మి, ఉమేశ్. ఊరు ఇల్లందకుంట మండలం మల్యాల. లక్ష్మికి దళిత బంధు కింద వచ్చిన నిధుల్లో రూపాయి వేస్ట్ కాకుండా అధికారుల సలహాలతో సూపర్ ఆలోచన చేసింది. వచ్చిన 9.90 లక్షల్లో సుమారు 6.50 లక్షలతో గ్రామంలో అతి పెద్ద టెంట్ హౌస్ పెడుతున్నది. అలాగే దానికి అనుబంధంగా 3.25 లక్షలతో ఒక ట్రాలీ ఆటోను కొనుక్కున్నది.
టెంట్ హౌజ్ సామగ్రిని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా ఇతరుల సాయం తీసుకోకుండా దళిత బంధు నిధులతో కొన్న ఆటోలోనే తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసుకోగా, లక్ష్మిని కలెక్టర్ కర్ణన్ ప్రత్యేకంగా అభినందించారు. ‘నా కొడుకు.. ప్రస్తుతం చదువుకుంటున్నడు. అటు చదువుకుటూనే.. ఇటు టెంట్ హౌజ్ నడిపిస్తడు. కూలీ నాలీ చేసుకుని బతికే మాకు సీఎం కేసీఆర్ ఇంత మంచి అవకాశాన్ని కల్పించడం సంతోషంగా ఉంది. ఆయనకు రుణపడి ఉంటం అని లక్ష్మి చెబుతున్నది.
నాలుగు గేదెలు.. ఒక ట్రాలీ
పక్క ఫొటోలో కనిపిస్తున్న దంపతుల పేర్లు అంబాల తిరుమల, రత్నాకర్. ఊరు జమ్మికుంట శివారులోని విలాసాగర్. వీరు దళిత బంధు డబ్బుతో ఇప్పటికే నాలుగు గేదెలు కొనుగోలు చేశారు. వీటికి అవసరమైన షెడ్డు.. అలాగే గడ్డి పెంచేందుకు అవసరమైన ఒక బోరును కూడా ఇవే డబ్బులతో వేయించారు. గేదెల ద్వారా వచ్చే పాల దిగుబడిని కేంద్రానికి తరలించేందుకు ఓ వాహనం ఉండాలని భావించి ఆటో కొనుక్కున్నారు. మంగళవారం ట్రాలీ ఆటోను అందుకొని మురిసిపోయారు.
మొన్నటిదాకా కూలీ పని తప్ప ఏం తెలియని మేము ఇప్పుడు డెయిరీకి ఓనర్లం అయ్యామంటే అది సీఎం కేసీఆర్ చలవే. తమ కాళ్ల మీద తాము నిలబతామని ఎంతో ధీమాతో చెబుతున్నారు. తమకు ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేసిన సీఎం కేసీఆర్‌కు జన్మంతా రుణపడి ఉంటామని స్పష్టం చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబానికి..
ఈమె పేరు సమిళ్ల శ్రీకళ. ఊరు జమ్మికుంట పట్టణం. భర్త కరుణాకర్ సిద్దిపేట కలెక్టరేట్లో కాంట్రాక్ట్ ఉద్యోగి. దళితులు అయితే చాలు దళిత బంధు ఇస్తామని మొదట్లోనే ప్రకటించిన సీఎం కేసీఆర్.. కాంట్రాక్ట్ ఉద్యోగి భార్య అయిన శ్రీకళకు కూడా ఇచ్చారు. వచ్చిన డబ్బుతో శ్రీకళ మినీ వ్యాన్ కొనుక్కున్నది. ఒక డ్రైవర్‌ను పెట్టుకుని ఈ వ్యాన్ నడిపించుకుంటామని చెబుతున్నది. దళిత బంధు కింద తమ కుటుంబానికి కూడా యూనిట్ మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని పేర్కొంటున్నది.
బతుకు చూపిండు..
మొన్నటిదాకా కూలీ పని తప్ప మాకు ఏం తెల్వదు. నా భర్త, నేను కష్టపడి పనిచేస్తేనే ఇల్లు గడిచేది. కానీ సీఎం కేసీఆర్ మాకు బతుకు చూపిండు. మా జీవితాలను నిలబెట్టిండు. కూలీ పనిచేసే మేము ఇపుడు టెంట్ హౌజ్, ఒక ట్రాలీ ఆటోకు ఓనర్లయినం. నా భర్తకు ఆటో డ్రైవర్ అనుభవం ఉంది. గిరాకీ ఉన్నపుడు ఎవరి సాయం లేకుండా టెంట్‌ను ఆటోలో తీసుకెళ్తడు. గిరాకీ లేనప్పుడు ట్రాలీని కిరాయి నడుపుకుంటడు. మా బతుకులు మార్చిన సీఎం కేసీఆర్ మేలు మరువం. జీవితాంతం గుర్తుచేసుకుంటం.
– రామళ్ల స్వరూప-రవీందర్ దంపతులు. చెల్పూర్, (హుజూరాబాద్ మండలం)