Godavarikhani | కోల్ సిటీ, జూలై 2: ప్రముఖ ఇంద్రజాలికులు, ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ ఆకస్మిక మృతి పట్ల గోదావరిఖని ఇంద్రజాలికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ఇంద్రజాలికులతో పట్టాభిరామ్ కు ఉన్న అనుబంధంను గుర్తు చేసుకొని ఆయన అకాల మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గోదావరిఖనికి చెందిన ప్రముఖ ఇంద్రజాలికులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు మేజిక్ రాజా, మేజిక్ హరి తదితరులు పట్టాభిరామ్ తో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకొని ఇంద్రజాల, వ్యక్తిత్వ రంగాలకు ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు.
రాజా మాట్లాడుతూ 1980లోనే పట్టాభిరామ్ కు సంబంధించిన మేజిక్ రహస్యాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయనీ, ఫోన్లు లేని ఆ కాలంలో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా పట్టాభిరామ్ మేజిక్ సీక్రెట్స్ ను అనుకరించే వాడనని అన్నారు. స్థానిక ఎఫ్సీఐ ఆనంద్ కేంద్రాలలో నిర్వహించిన పలు ఉగాది ఉత్సవాలలో ఆయన ప్రదర్శనలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం లభించిందనీ, అప్పటి నుంచే ఆయనతో పరిచయం కాస్త శిష్యరికం వరకు వెళ్లి ఆయన స్ఫూర్తిగా తాను ఇంద్రజాల విద్యలో ప్రావీణ్యం సంపాదించానన్నారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో ఆయనకు విడదీయరాని బంధం ఉండేదని గుర్తు చేశారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఇంద్రజాల ప్రదర్శనలలో ఆయన చేతుల మీదుగా పరస్కారాలు, సన్మానాలు అందుకోవడం మర్చిపోలేనని పేర్కొన్నారు. ఈ ప్రాంత కళాకారులకు గురువుగా ఎంతగానో ప్రోత్సహించే ఆయన అకాల మృతి తమకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు కళాకారులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.