ప్రభుత్వ రంగ సంస్థ సిరిసిల్లలోని టీఐడీఈఎస్ నిరుద్యోగులకు బాసటగా నిలుస్తున్నది. మోటర్ ఫీల్డ్‌పై ఆసక్తి ఉన్న వారికి అత్యాధునిక ప్రమాణాలతో నయా డ్రైవింగ్ ట్రైనింగ్ అందిస్తున్నది. రాష్ట్రంలోనే తొలి అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ సంస్థగా పేరొందిన సెంటర్, అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో 20 ఎకరాల్లో 21.69 కోట్లతో నాలుగేండ్ల కింద ఏర్పాటైంది. ఇప్పటి వరకు 5 వేల మందికిపైనే తర్ఫీదునిచ్చింది. అందులో వందలాది మందికి డ్రైవర్ ఉద్యోగాలు సైతం లభించగా, ఈ కేంద్రానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది.
రాజన్న సిరిసిల్ల, మార్చి 28(నమస్తే తెలంగాణ) : దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అచ్చీరాని డ్రై వింగ్, నిబంధనలు తెలియకపోవడం యాక్సిడెంట్లకు కారణం అవుతుండగా, ప్రమాదాల నివారణ కోసం డ్రైవర్లకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థగా తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ (టీఐడీఈఎస్)ను సిరిసిల్లలో అప్పటి మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేశారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో 20 ఎకరాల్లో 21.69 కోట్లతో 2021లోనే ప్రారంభించి, అందుబాటులోకి తెచ్చారు. ఇది రాష్ట్రంలోనే తొలి అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ సంస్థ. తెలంగాణకే తలమానికంగా పేరు తెచ్చుకున్నది. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణకు అశోక్ లేలాండ్ సంస్థ సహకారంతో నిష్ణాతులైన శిక్షకులతో యువతకు 30 రోజులపాటు ట్రై నింగ్ ఇస్తున్నది. అంతేకాదు, సంస్థనే డ్రైవింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా అందిస్తున్నది. ఇందులో ఇప్పటి వరకు వివిధ రాష్ర్టాలకు చెందిన 5 వేల మంది లైట్ మోటర్, హెవీమోటర్ వెహికల్ డ్రైవింగ్‌లో నైపుణ్య శిక్షణ పొందారు.
ఈ సెంటర్లో సెక్రటరీ, ప్రిన్సిపల్ దురై మురుగన్ ఆధ్వర్యంలో మోటర్ వాహనాల తయారీ కంపెనీల్లో ప్రొఫెసర్లతో యువతకు శిక్షణ ఇచ్చి సుశిక్షితులైన డ్రైవర్లుగా తీర్చిదిద్దుతున్నారు. వాహనాల డ్రైవింగ్, రోడ్లు, పాఠశాలలు, జంక్షన్లు, ట్రాఫిక్ రూల్స్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించిన తర్వాత వాహనాలు నడిపించే శిక్షణ ఇస్తారు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వారిలో 300 మంది సీఆర్పీఎఫ్, పోలీస్, బీఎస్ఎఫ్, ప్రైవేట్ కంపెనీల్లో డ్రైవర్ ఉద్యోగాలు కూడా పొందారు. బయట డ్రైవింగ్ స్కూళ్లు అనేకం ఉన్నప్పటికీ ఇందులో శిక్షణ పొందిన వారికే అన్ని సంస్థలు తొలి ప్రాధాన్యత ఇస్తుండడంతో నిరుద్యోగ యువతీ యువకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో మూడు వేల డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నందున చాలా మంది శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అభ్యర్థులకు హాస్టల్‌తో కలిపి నెలకు 15 వేల ఫీజు వసూలు చేస్తున్నది. వివిధ ప్రాంతాల నుంచే యువతకు వసతి, భోజనం ఉంటుంది. భవిష్యత్తులో ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
..ఈ చిత్రంలో కనిపిస్తున్న యువతి పేరు సోనాలి (20). మహారాష్ట్రలోని గడ్చిరోలీ తాలూక బండె గ్రామం. ఏడో తరగతి దాకా చదువుకున్నది. తల్లిదండ్రులు ఆ గ్రామంలోనే క్రషర్ మిషన్‌లో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆమెకు ఒక అక్క, ముగ్గురు అన్నలు. సోనాలీ రెండో కూతురు. అదే గ్రామంలోని రెడీమేడ్ గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నది. ఈ క్రమంలో ఆ తాలూకాకు చెందిన 32 మంది యువతకు మోటర్ వాహనంలో శిక్షణ ఇప్పించేందుకు త్రివేణి ఎర్త్‌మూవర్స్ అనే కంపెనీ స్పాన్సర్ చేసింది. గతేడాది డిసెంబర్ 11న జిల్లాలోని టీఐడీఈఎస్లో చేరింది. 30 రోజులు లైట్ మోటర్ వాహనంలో శిక్షణ పొందింది. తిరిగి అదే గార్మెంట్ కంపెనీలో దుస్తులను సరఫరా చేసేందుకు నెలకు 8 వేల వేతనంతో టాటా ఏసీ డ్రైవర్‌గా చేరింది. సోనాలి ఒక్కరేకాదు, ఇప్పటివరకు తెలంగాణతోపాటు వివిధ రాష్ర్టాల్లోని చాలా మంది యువతీ యువకులు శిక్షణ పొంది ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్లుగా ఉద్యోగాలు సంపాదించి మంచి వేతనం పొందుతున్నారు.
నేను డిగ్రీ చదువుకున్నా. ఉద్యోగం లేదు. డ్రైవింగ్ అంటే నాకెంతో ఇష్టం. ఆర్టీసీలో డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేస్తున్నట్లు వార్తలు చూశా. డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుని ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాలనుకున్నా. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్లో చేరితో తప్పకుండా ఉద్యోగం వస్తుందని మా ఫ్రెండ్స్ చెప్పారు. వెంటనే ఇక్కడికొచ్చి చేరా. చాలా బాగుంది. డ్రైవింగ్ ఒక్కటే కాదు, అన్ని రకాల మెలకువలు నేర్పుతున్నారు. ఇంత మంచి సెంటర్‌ను ఏర్పాటు చేసిన రామన్నకు కృతజ్ఞతలు.
నేను డిగ్రీ పూర్తి చేశా. ఖాళీగా ఉంటున్నా. హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఎక్కడా అవకాశం లేదు. ఏదైనా లారీపై క్లీనర్‌గా పనిచేస్తే తప్ప నీకు నేర్పరంటూ చెప్పా రు. ప్రైవేట్‌లో అన్ని లైట్ మోటర్ వెహికల్ శిక్షణనే ఇస్తున్నా రు. అందుకే సిరిసిల్లకు వచ్చి టీఐడీఈఎస్లో చేరా. సిమ్యులేటర్‌పై శిక్షణ ఇచ్చిన తర్వాత హెవీమోటర్ వెహికల్‌పై శిక్షణ ఇచ్చారు. ఇనిస్టిట్యూట్‌లోని ట్రాక్‌లపై హెవీ వెహికల్ శిక్షణ ఇచ్చారు. తర్వాత బయటి రోడ్లపైకి పంపుతారు. కళాశాల మాదిరిగా ప్రిన్సిపాల్, లెక్చరర్లు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాలను ఎలా నివారించాలో అవగాహన కల్పిస్తున్నారు. కేటీఆర్ చొరవతో హెవీ మోటర్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్న నా కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది.
మా టీఐడీఈఎస్ సంస్థ ద్వారా నిరుద్యోగులకు డ్రైవింగ్‌లో నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటి వరకు 5 వేల మందికి శిక్షణ ఇచ్చాం. అందులో 300 మంది ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంతోపాటు ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. సుశిక్షితులైన డ్రైవర్లను తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ప్రస్తుతం ఆర్టీసీలో మూడువేల డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ రాబోతున్నది. ఇక్కడ సరిఫ్టికెట్ పొందిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి.