Ramagiri | రామగిరి : సింగరేణి ఆస్తులు అన్యాక్రాంతానికి బాధ్యుడైన అర్జీ-3 ఎస్టేట్ అధికారి ఐలయ్యపై విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శెంకేషి రవీందర్ డిమాండ్ చేశారు. సెంటినరీకాలనీ టీబీజీకేఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక అధికార పార్టీ నాయకుని అండతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. ఒకవైపు సంస్థ భూములు కబ్జాకు గురవుతుంటే సంరక్షించాల్సిన అధికారి తనకు సంబంధం లేదన్నట్టుగా బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నా జీఎం ఆయనకు వత్తాసు పలకడం సబబు కాదన్నారు. పాత పీనల్ రెంట్ రిసిప్ట్ లను అడ్డం పెట్టుకుని కొట్టగా టేలాలు వేయిస్తున్నారని, తమ వద్ద ఆధారాలున్నట్లు తెలిపారు. ఆరోపణలు ఎదురుకుంటున్న అధికారి తన నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి తమ నాయకుని పేరు తీయడం చూస్తుంటే ఆయనకు అధికార పార్టీకి ఉన్న సంబంధాలు బట్టబయలవుతున్నాయని తెలిపారు.
తమవద్ద ఉన్న ఆధారాలను జీఎం, విజిలెన్స్ తో పాటు డైరెక్టర్ పా, సీ అండ్ ఎండీకి మెయిల్ చేస్తున్నామని తక్షణం విచారణ జరిపి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఐలయ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కొత్తగా ఎన్ని నిర్మాణాలు జరిగాయి, ఎన్ని టేలాలు వేశారు, వకీల్ పల్లి చర్చి పక్క భూమి కబ్జాకు కారకులెవరు అని కూలంకశంకంగా విచారణ జరపడంతో పాటు పాత పీనల్ రెంట్ రిసిప్ట్ లను ఎవరికి బదళాయించారు అనే విషయంపై దృష్టి పెట్టి బాధ్యుడైన ఐలయ్యపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జీఎం మధుసూదన్ గుడ్డిగా ఐలయ్యకు వంతపాడటం మానుకోవాలని సంస్థ ఆస్తుల పరిరక్షణలో జరిగిన అవినీతికి బాధ్యత వహించాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీటీసీ పెగడ శ్రీనివాస్, నాయకులు దామెర శ్రీనివాస్, బొంకూరి పోశం, కృష్ణ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.