జగిత్యాల కలెక్టరేట్, మే 21: ఆ చిన్నారికి మూడేళ్లకే నూరేళ్లు నిండాయి. తల్లితో కలిసి సంతోషంగా ఎల్లమ్మ పట్నాలకు వెళ్లొస్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రాణాలు గాల్లో కలిశాయి. కండ్ల ముందే కూతుర్ని కోల్పోయిన ఆ తల్లి హృదయవిదారకంగా రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. జగిత్యాల సీఐ వేణుగోపాల్ వివరాల ప్రకారం.. పెగడపల్లికి చెందిన నిమ్మని రాజు, శిరీష దంపతులకు ఐదేళ్ల కొడుకు, మూడేళ్ల కూతురు విన్మయ ఉన్నారు. రాజు ఇటీవలే ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. మంగళవారం జగిత్యాల పట్టణ పరిధిలోని లింగంపేటలో బంధువులు ఎల్లమ్మ పట్నాలు వేసుకుంటుండగా.. శిరీష తన కూతురు విన్మయతో కలిసి స్కూటీపై వెళ్లింది. సాయంత్రం దాకా సంతోషంగా అక్కడే గడిపి తిరిగి స్వగ్రామానికి పయనమైంది. లింగంపేట నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే గుర్తుతెలియని వాహనం స్కూటీని ఢీకొట్టింది. దీంతో తల్లీ కూతుళ్లు కిందపడ్డారు. తల్లి స్వల్ప గాయాలతో బయటపడినా.. చిన్నారి తీవ్ర గాయాలతో మృత్యు ఒడికి చేరింది. చికిత్స కోసం జగిత్యాల జిల్లా ప్రధాన దవాఖానకు తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలోనే చనిపోయింది. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొన్నది. కండ్ల ముందే బిడ్డ చనిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తున్నది. తల్లి శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.