పెద్దపల్లి, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రామగుండం నగర పోలీస్ కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అంబర్ కిశోర్ఝాను రామగుండం నగర పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఈ మేరకు ఆయన పోలీస్ కమీషనరేట్ చేరుకొని సాయుధ పోలీసులు వందనం స్వీకరించారు. అటుపై ప్రస్తుత పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్, పోలీస్ కమిషనరేట్ అధికారులు నూతన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు.
ఈ సందర్బంగా నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సత్ప్రవర్తన, మంచి నడవడిక కలిగిన వారికీ, ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోపాటు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తామన్నారు. ల్యాండ్ మాఫియా, డ్రగ్స్, గంజాయి రవాణా పట్ల ఉక్కు పాదం మోపుతామని స్పష్టం చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల ప్రజల సహకారంతో ముందుకెళ్తామన్నారు. సామాన్యులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ఇబ్బందులెదురైతే అందుబాటులో ఉన్న డీసీపీలతోపాటు తననూ నేరుగా కలువవచ్చునని, అటువంటి వారికి అండగా నిలుస్తామని తెలిపారు.
2009 ఐపిఎస్ బ్యాచ్ అధికారి అంబర్ కిషోర్ ఝా 2011లో తొలుత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏఎస్పీగా, 2012 వరంగల్ ఓఎస్డీగా, అదనపు ఎస్పీగా, 2014లో వరంగల్ ఎస్పీగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగానూ సేవలందించారు. అదే ఏడాది కేంద్ర సర్వీసులకు వెళ్లారు. గతేడాది ఫిబ్రవరిలో డీఐజీగా పదోన్నతి పొంది రాచకొండ పోలీస్ కమిషనరేట్ జాయింట్ పోలీస్ కమిషనర్‌గా, అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్‌గా పని చేశారు. నూతన నగర పోలీస్ కమిషనర్‌ను అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సీ రాజు, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ పీ కరుణాకర్‌తోపాటు పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల ఏసీపీలు, ఇన్సెస్నెక్టర్లు, ఏఆర్ ఏసీపీలు, ఆర్ఐలు, ఇతర విభాగాల అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు.