కరీంనగర్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆదేశించారు. సోమవారం కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె మానకొండూర్లోని బాలికల ఉన్నత పాఠశాలలో పోషణ్ జాతరను ప్రారంభించారు. అనంతరం కరీంనగర్లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మరో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నూతన సిలబస్ విధానం ద్వారా అంగన్వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్యను బోధించడంతో అవి సరైన దిశలో పయణిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రతి వారంలో రెండు మూడు రోజులు కలెక్టర్లు, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూ చించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు ముందున్నాయని, తమ పిల్లలను అంగన్వాడీల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు.
అంగన్వాడీ టీచర్లు అధునాతన బోధనా పద్ధతులను అలవర్చుకోవాలని, గర్భిణులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాజీ పడవద్దని చెప్పారు. కల్తీ సరుకులు సరఫరా చేసినా, ఆహారంలో నాణ్యత కొరవడినా కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని, లైసెన్స్లు రద్దు చేయాలని ఆదేశించారు. తక్కువ బరువు ఉన్న పిల్లలపై శ్రద్ధ చూపాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, అంగన్వాడీలను ఆకస్మిక తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశా రు. వృద్ధాశ్రమాల్లో వార్డెన్లు వృద్ధులపై శ్రద్ధ చూపాలని, తల్లి దండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిం చే పిల్లలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి పల్లె ఆదర్శంగా నిలవాలి
రాష్ట్రంలోని ప్రతి పల్లె ఆదర్శంగా నిలవాలని, అందుకు అధికారులు కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి సీతక్క సూచించారు. పంచాయతీ రాజ్ శాఖలో పెండింగ్ బిల్లుల అంశం సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉందని, ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఉపాధి హామీ ద్వారా చెక్ డ్యాంలు, మట్టి రోడ్లు, కాలువల నిర్మాణం వంటి ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే చేయాలన్నారు.
అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగుస్తుందని, ఆ వెంటనే గ్రామ పంచాయతీల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. స్వచ్ఛతాహీ సేవాలో పాల్గొన్న వారందరికీ అభినందన కార్యక్రమం అక్టోబర్ 4,5 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. సమీక్షా సమావేశంలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్ కాంతి వెస్లీ, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రాంచంద్రన్, కలెక్టర్లు పమేలా సత్పతి (కరీంనగర్), సత్య ప్రసాద్ (జగిత్యాల), కోయ శ్రీహర్ష (పెద్దపల్లి), సందీప్ కుమార్ ఝా (సిరిసిల్ల), కరీంనగర్ అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ పాల్గొన్నారు.