SESS Director | సిరిసిల్ల టౌన్, జూలై 21: తనపై వచ్చిన ఆరోపణలన్ని అవాస్తవమేనని, కావాలనే కొంత మంది బ్యాక్ బిల్లింగ్ అంశంలో తప్పుడు ప్రచారానికి తెరలేపారని సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పద్మశాలీ సోదరులకు ఈఆర్సీ నిబందనల ప్రకారం వేసిన బ్యాక్ బిల్లింగ్ గుదిబండగా మారిందన్నారు.
సెస్ డైరెక్టర్గా ఉన్న తనను వారు కలిసిన సందర్భంలో కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని, దీంతో బ్యాక్ బిల్లింగ్ పై కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. కోర్టు సంబందిత ఖర్చులు వారే భరించుకున్నారని తెలిపారు. ఆ డబ్బులతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సెస్ డైరెక్టర్లకు నేను డబ్బులు పంపిణీ చేశామంటూ వచ్చిన ఆరోపణలు ఎటువంటి వాస్తవం లేదన్నారు. కోర్టుకు సంబంధించిన విషయంలో కేవలం అవసరమైన సలహాలు, సూచనలు మాత్రమే తాను చేశానని అన్నారు.
గత పదిహేను ఏండ్లుగా బీఆర్ఎస్ లో ఉంటూ పలు పదవుల్లో పని చేశానని తెలిపారు. సేవ చేసేందుకే తాము రాజకీయాల్లో ఉన్నామని చెప్పారు. తన సతీమణి దార్నం అరుణ కౌన్సిలర్ గా రెండు సార్లు పని చేశారన్నారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా తాను కౌన్సిలర్ గా అరుణ కేవలం సేవా మా పని చేస్తున్నామన్నారు. వార్డు పరిధిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించామన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. ఈ సమావేశంలో సెస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.