Collector Koya Sri Harsha | పెద్దపల్లి, అక్టోబర్ 30 : పెద్దపల్లి జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్లో ఐసీపీఎస్ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ పిల్లలను పూర్తి స్థాయిలో గుర్తించాలన్నారు. పిల్లల తల్లిదండ్రుల పేరిట ఆస్తులు ఉంటే అన్యాక్రాంతం కాకుండా పిల్లలకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనాథ, పాక్షిక అనాథ బాలికలకు కేజీబీవీలు, గురుకులాలో సీట్లు కేటాయించేలా చూడాలన్నారు. చైల్డ్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ 1098కు వచ్చే ప్రతీ ఫిర్యాదుకు అటెండ్ కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోక్సో కేసులకు సంబంధించి పరిహారం ఫైల్ పెండింగ్ లేకుండా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా పిల్లలు భిక్షాటన చేస్తూ కనిపించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్, దేవాలయాలు, బస్టాండ్, జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో రెగ్యులర్ తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లాలో అనుమతి లేకుండా నడిపే ఆశ్రమాలకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.