పెద్దపల్లి, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి కమాన్ : పెద్దపల్లిలోని బీసీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో 590 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పెద్దపల్లి పట్టణానికి దూరంగా పొలాల మధ్యలో ఉండడం.. బురద రోడ్డు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
హాస్టల్ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరిగాయి. పేరుకుపోయిన చెత్తాచెదారం కంపు కండుతున్నది. హాస్టల్ చుట్టూ ప్రహరీ సరిగా లేకపోవడంతో విషపురుగులు వచ్చే ప్రమాదం ఉందని విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అన్నం, కూరలు, టిఫిన్లు బాగుండేవని పిల్లలు చెప్పేవారని, ఇప్పుడు వంటలు సరిగా ఉండక పోవడంతో అన్నం తినలేక ఖాళీ కడుపుతో ఉంటున్నట్టు విద్యార్థులు తమతో చెబుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు.
హాస్టల్ ముందు భాగంలో పైపులైన్ లీకేజీతో నీటి మడుగు తయారై దుర్వాసన వస్తుందని, దీంతో ఈగలు, దోమలు తయారై విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దోమల బెడద, కిటికీలు సరిగా లేక కోతుల బెడద, పాములు, తేల్లతో తంటాలు పడుతున్నాని చెబుతున్నారు.
రోడ్డు సౌకర్యం కల్పించాలి
హాస్టల్కు వచ్చేందుకు రోడ్డు అధ్వానంగా ఉంది. వానకాలంలో ఇక్కడికి రావడం చాలా ఇబ్బందవుతుంది. వర్షం పడితే మొత్తం బురదమయంగా మారుతుంది. రంగంపల్లి రహదారి నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ రావాల్సిందే. ఇటు వైపు రోడ్డు బాగు లేదని ఆటో వాళ్లు రావడం లేదు. విద్యార్థులకు ఏమైనా అత్యవసరమైతే మెయిన్ రోడ్డు వరకు నడిచి వెళ్లాలి. రంగంపల్లి నుంచి హాస్టల్ వరకు సీసీ రోడ్డు వేయించాలి.
– ఇరుమళ్ల శంకర్, విద్యార్థిని తండ్రి, భూపతిపూర్ (సుల్తానాబాద్)
నాణ్యమైన భోజనం అందించాలి
హాస్టల్లో అందించే భోజనం బాగుండడం లేదు. కూరలు చప్పిడిగా, నీళ్లుగా ఉంటున్నయ్. అన్నం సరిగ్గా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నరు. టిఫిన్లు కూడా రుచిగా ఉండడం లేవు. గతంలో ఉన్న వంట మనిషి మంచిగా చేసేది. ఈ ఏడాది వేరే వాళ్లు రావడంతో సరిగ్గా వండడం లేదు. రుచికరంగా లేకపోవడం వల్ల విద్యార్థులు అన్నం, కూరలు పారేస్తున్నరు. అనుభవం కలిగిన కుక్కర్స్తో వంటలు చేయించాలి. నాణ్యమైన భోజనం అందించాలి.
– ముత్యాల సంతోష్, విద్యార్థిని తండ్రి, హన్మంతునిపేట(పెద్దపల్లి)