Karimnagar | కమాన్ చౌరస్తా, అక్టోబర్ 8 : గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ జోనల్ స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచిన కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను అభినందించేందుకు పాఠశాలలో ప్రత్యేక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. క్రీడలను వార్షిక ప్రణాళికలో భాగం చేయడం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతుందని, ఫుట్బాల్ వల్ల శారీరక, మానసిక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందుతుందని ఆయన అన్నారు.
జోనల్ స్థాయిలో రాణించి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థుల్లో బాలికల నుంచి ఎం ఆరాధ్యా రెడ్డి (9వ తరగతి), డీ సంషిత (8వ తరగతి), ఈ గ్రేసి (8వ తరగతి), పీ అనుమ్ (10వ తరగతి), బాలుర విభాగంలో ముక్రమ్ (10వ తరగతి), బీ కరన్దీప్ (10వ తరగతి), టీ నిశ్చల్ (10వ తరగతి), కే ఋషికేష్ (9వ తరగతి), వీరు ఈ నెల 12, 13, 14 తేదీల్లో హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయిలోనూ రాణించి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షిస్తూ విజేతలకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.