Agriculture Department | హుజురాబాద్ రూరల్, జూన్ 17 : హుజురాబాద్ పట్టణంలోని ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. పైనుంచి పెచ్చులు ఊడి కింద పడడంతో అధికారులు, సిబ్బంది, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. వర్షాకాలం కావడంతో చిన్నపాటి చిరుజల్లులకే లోపలికి నీటి పదును వచ్చి కంప్యూటర్లు కూడా తడిచే ప్రమాదం ఉంది. అంతేకాకుండా విద్యానగర్ కు సీసీ రోడ్డులు మరమ్మతులు చేయడంతో కార్యాలయం రోడ్డుకు కిందికి కావడంతో వర్షం కొడితే నీరు నిల్వ ఉండి కార్యాలయంలో పలికి వెళ్లే వీలు కూడా ఉండదు. ఇదే కార్యాలయంలో ఏడీఏ, ఏవో ఆఫీసులో ఉంటాయి.
హుజురాబాద్ డివిజన్ పరిధిలోని హుజురాబాద్ జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, సైదాపూర్ మండలాలు చెందిన ఏవోలు, ఏఈవోలు, రైతులు ఎక్కువ శాతం ఈ కార్యాలయానికి పని నిమిత్తం వస్తూ ఉంటారు. కార్యాలయం చుట్టూ ముళ్లపదలు పిచ్చి మొక్కలు నిండి ఉండడంతో విష పురుగులు కూడా సంచరిస్తున్నాయని కార్యాలయానికి వచ్చే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కూడా మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి నూతన భవన నిర్మాణం చేపట్టాలని అధికారులు, సిబ్బంది రైతులు కోరుతున్నారు.