Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 4 : 20 యేళ్ల క్రితం నిర్మించుకున్న ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారని ఆరోపిస్తూ బాధిత కుటుంబం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించింది. న్యాయం కోసం రోజంతా పిల్లా పాపలతో అక్కడే బైఠాయించింది. అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని గోడు వెల్లబోసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. రామగుండం నగర పాలక సంస్థ పరిధి ఎల్కలపల్లి గ్రామానికి చెందిన మీనుగు లిఖిత, పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులు మంగళవారం కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకొని ఆందోళనకు దిగారు. నెల రోజుల కిందట మున్సిపల్ అధికారులు వచ్చి తమ ఇంటికి అనుమతి లేదంటూ తాము ఇంట్లో లేని సమయంలో దౌర్జన్యంగా కూల్చివేశారని ఆరోపించారు.
తమ ఇంటి పెద్ద అనారోగ్యంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించడానికి వెళ్లామని, తిరిగి వచ్చి చూసేసరికి ఇల్లు కూల్చివేసి ఉంది. దీంతో మున్సిపల్ అధికారులను సంప్రదిస్తే ఫిర్యాదు ఆధారంగా కూల్చివేశామని చెబుతున్నారని, కానీ, 20 యేళ్లుగా ఉన్న ఇంటికి ప్రతీ ఏటా మున్సిపాలిటికీ పన్నులు కూడా చెల్లిస్తూ వస్తున్నాం. జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశాం. న్యాయం కోసం కోర్టును కూడా ఆశ్రయిస్తే తమకే అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. నష్ట పరిహారం కోసం నగర పాలక అధికారులను సంప్రదిస్తే న్యాయం జరగడం లేదని వాపోయారు. కాగా, ఉదయం నుంచి రోజంతా ఆఫీసు ఎదుటనే బైఠాయించి ఏకరువు పెట్టారు. ఈ విషయమై నగర పాలక టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీహరిని సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.