ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రుల మధ్య వివాదం రాజుకున్నది. తాజాగా ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై దుమారం రేగుతున్నది. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పొన్నం మాటలపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఎక్కడికక్కడ నిరసనలు తెలుపడంతోపాటు పలుచోట్ల దిష్టిబొమ్మలను దహనం చేశాయి. అక్కడితో ఆగకుండా 24 గంటల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే మంత్రి పొన్నం ఇంటితోపాటు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు చేశాయి. దీంతో హస్తం పార్టీలో కలకలం మొదలైంది.
కరీంనగర్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ మధ్య ఇప్పటికే విభేదాలున్నాయి. పైకి బాగానే మాట్లాడుకుంటున్నా అంతర్గతంగా పోరు నడుస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులకు లోనవుతున్నారు. అంతేకాదు, ఇరువురు కరీంనగర్ జిల్లాకేంద్రంపై తమ ఆధిపత్యాన్ని చూపేందుకు పోరు సాగిస్తున్నారు. ఇదే సమయంలోనే ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి పదవి వరించింది. అయితే అడ్లూరిని శ్రీధర్‌బాబు అనుచరుడిగా పార్టీ వర్గాలు పేర్కొంటున్న నేపథ్యంలో పొన్నం కోపం పెంచుకున్నారన్న చర్చ పార్టీలో సాగుతున్నది. ఇటీవల శాతవాహన విశ్వ విద్యాలయంలో ఎస్సీ నిధులతో చేపట్టిన ఓ హాస్టల్ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలకు ఆజ్యం పోసినట్టు తెలుస్తున్నది. అక్కడి నుంచే పొన్నం, అడ్లూరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైనట్టు ప్రచారం జరుగుతున్నది.
ఈ పరిస్థితుల్లో తాజాగా పొన్నం ప్రభాకర్.. మంత్రి అడ్లూరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న మంత్రి అడ్లూరి, ఒక వీడియో విడుదల చేయడం కలకలం రేపుతున్నది. వివాదం ముదురుతున్న నేపథ్యంలో పొన్నం క్షమాపణ చెబుతారా.. లేదా..? అన్నదానిపై రకరకాలుగా చర్చలు జరుగుతుండగా, అడ్లూరి లక్ష్మన్‌కుమార్ ఇప్పటికే పొన్నంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు పొన్నం వ్యాఖ్యలపై దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్లూరికి మద్దతుగా మంగళవారం ఉమ్మడి జిల్లాలో నిరసనలు తెలిపారు. ఎమ్మార్సీఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో మంత్రి పొన్నం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈనెల 8న జిల్లా వ్యాప్తంగా ముఖ్యకూడళ్లలో దిష్టిబొమ్మలను దహనం చేస్తామని, 9 తేదీన కరీంనగర్‌లోని ఆయన ఇంటితోపాటు హుస్నాబాద్‌లో క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే జగిత్యాల, కోరుట్ల, ధర్మపురిలో పొన్నం దిష్టిబొమ్మలను దహనం చేశారు. పెగడపల్లిలో నల్లబాడ్జీలతో నిరసన తెలిపారు.
ధర్మపురి, వెల్గటూర్, చిగురుమామిడి తదితర మండలాల్లోనూ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇంకోవైపు అంతటా దళితసంఘాల నాయకులు ప్రెస్మీట్లు పెట్టి, పొన్నం వ్యాఖ్యలను ఖండించారు. దళిత జాతిని అవమానించేలా చేసిన వ్యాఖ్యలపై పొన్నం భేరషతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆయన నియోజకవర్గం సహా ఉమ్మడి జిల్లాలో ఎక్కడ పర్యటించినా అడ్డుకుంటామని హెచ్చరించారు. పొన్నం మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న మరో మంత్రి వివేక్ ఎందుకు ఖండించలేదని మండిపడుతున్నారు. దళితులకు వివేక్ వ్యతిరేకమా..? అనుకూలమా..? అని చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పొన్నం తీరుపై అధిష్టానం ఎలా స్పందిస్తున్న దానిని బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకుంటామని చెబుతున్నారు.