దహెగాం. నవంబర్ 13 : నీళ్లచారు..పుచ్చిపోయిన కూరగాయలతో కస్తూర్బా విద్యార్థులకు భోజనం అందించడం, మెనూ పాటించకపోవడంతో అధికారులు, సిబ్బందిపై కుమ్రం భీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం దహెగాం మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల విద్యాలయాన్ని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో కలిసి అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు వివరాలు పరిశీలించగా ఎస్వో సెలవులో ఉన్నారని తెలిపారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. 312 మందిలో 80 మంది గైర్హాజరవడంపై ఉపాధ్యాయులను ప్రశ్నించారు. గైర్హాజరైన వారి అడ్రస్‌ను ఆ గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు పంపించి వారిని పాఠశాలకు వచ్చేలా చూడాలని ఎంపీడీవో రాజేందర్‌ను ఆదేశించారు.
అనంతరం అక్కడ వండుతున్న భోజనాన్ని పరిశీలించారు. బుధవారం రోజున మెనూ ప్రకారం అన్నం, పప్పు, కూరగాయలు, రసం పెట్టాల్సి ఉండగా నీళ్లచారు, క్యాలీఫ్లవర్ వండుతుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పట్టిక చూపించాలని అడుగగా సిబ్బంది చూపించకపోవడంతో వేరే విద్యాలయం నుంచి వాట్సాప్‌లో తెప్పించి చూపించారు. స్టోర్ రూమ్ వెళ్లి చూడగా ఉప్మా రవ్వ, చక్కెరకు చీమలు పట్టి ఉన్నాయి. కూరగాయలను పరిశీలించడంతో పుచ్చిపోయిన కూరగాయలు, వాడిపోయిన తోటకూర ఉండడంతో మండిపడ్డారు. గురుకులంలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతోనే విద్యార్థులు గైర్హాజరవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదని, బోరు నీళ్లు తాగుతున్నామని విద్యార్థులు తెలుపడంతో ఎందుకు మరమ్మతు చేపించలేదని సిబ్బందిని ప్రశ్నించారు. బోరు నీటిని పరీక్షించి రిపోర్టు ఇవ్వాలని ఎంపీడీవోను ఆదేశించారు. విద్యార్థులకు అందించే భోజనం, కల్పించాల్సిన వసతులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం బీబ్రా గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. సర్వే పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ దామెర కవిత, ఎంపీడీవో రాజేందర్, ఎస్ఐ కందూరి రాజు, ఇన్చార్జి సీఈవో నారాయణ, తదితరులు పాల్గొన్నారు.