విద్యానగర్, అక్టోబర్ 2 : కరీంనగర్లో సువిశాలమైన పార్కింగ్, అతి తక్కువ ధరలతో లెక్కకు మించిన వస్త్ర వెరైటీలు, అధునాతన హంగులతో రూపొందించిన ది చెన్నై షాపింగ్‌మాల్‌ను మంత్రి గంగుల కమలాకర్, సినీ నటి కృతిశెట్టి సోమవారం ప్రారంభించారు. జబర్దస్త్ టీం సభ్యులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా సినీనటి కృతిశెట్టి మాట్లాడుతూ, చెన్నైషాపింగ్ మాల్లో నాణ్యమైన దుస్తులు సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉన్నాయని, 99కే చీర అమ్మడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.
బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా, అన్నీ ఒకే దగ్గర దొరికేలా వస్ర్తాలు లభించడం బాగుందన్నారు. నిర్వాహకులు మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 17 షోరూంలలో నాణ్యమైన వస్ర్తాలు, ఆభరణాల విక్రయాల్లో ఎంతోమంది ప్రజలకు ది చెన్నై షాపింగ్ మాల్ చేరువైందని, 18వ షోరూంను ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్లో ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. నిష్ణాతులైన డిజైనర్లతో రూపొందించిన అధునాతన డిజైన్లలో పట్టు వస్ర్తాలను చేనేత కార్మికులు తమ సొంత మగ్గాలపై నిపుణుల పర్యవేక్షణలో నేశారని, అతి తక్కువ ధరలకే వీటిని ది చెన్నై షాపింగ్ మాల్లో అందించగలుగుతున్నామన్నారు.
ఇక్కడ లభించే డిజైన్లు, కలర్ కాంబినేషన్లు ఆడ పడుచుల అందాన్ని మరింత ఇనుమడిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా కృతిశెట్టి షాపింగ్ మాల్లో సందడి చేసింది. జబర్దస్త్ టీంతో కలిసి డ్యాన్స్ చేసింది. కోర్టు రోడ్ జన సందోహంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశకర్, కార్పొరేటర్లు సరిళ్ల ప్రసాద్, మేచినేని అశోక్‌రావు, నిర్వాహకులు మర్రి వెంకట్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మర్రి జన్నారెడ్డి, మర్రి మధుమతి, తదితరులు పాల్గొన్నారు.