Jagityal | జగిత్యాల, జూన్ 06 : డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడితే చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా రవాణా శాఖాధికారి భధ్రు నాయక్ అన్నారు. డీటీఓ భధ్రునాయక్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మరో వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రయివేట్ స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే గడువులోగా ప్రయివేట్ పాఠశాలల బస్సులను విధిగా ఫిట్ నెస్ చేయించుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. నేటి వరకు ఇంకా 170 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. ఫిట్ నెస్ ఉంటేనే బస్సులను రోడ్లపై తిప్పాలని లేనట్లయితే వాటిని సిజ్ చేస్తామని డీటీ ఓ హెచ్చరించారు.
15 ఏళ్ళు దాటినా బస్సులకు ఫిట్ నెస్ నిరకరిస్తున్నామని భధ్రు నాయక్ తెలిపారు. ప్రతి స్కూల్ బస్సుల్లో అటెండర్ తప్పనిసరని పేర్కొన్నారు. స్కూల్ బస్సులు రుట్లలోకి వెళ్తే డ్రైవర్ కేవలం డ్రైవింగ్ మాత్రమే చేయాలనీ పేరెంట్స్ కు స్కూల్ సమాచారం బస్సు అటెండరే మాట్లాడాలని, పిల్లల విషయంలో బాధ్యత అటెండర్దేనని స్పష్టం చేశారు. డ్రైవర్లు ప్రతి ఆరు నెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని, వాహనం నడిపేటప్పుడు డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడకూడదని, ఫైర్‌సేఫ్టీ, మెడికల్ కిట్ ప్రతి స్కూల్ బస్సులో ఉండాలని డీటీఓ సూచించారు. డ్రైవర్ల వయస్సు 60 ఏళ్ల లోపు ఉండి, హెవీ వాహన లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. పిల్లలు బస్సు ఎక్కేప్పుడు ఫుట్ బోర్డుకు హ్యాండ్ రేయిలింగ్ ఉండాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలపై కొరడా జూలిపిస్తామని భధ్రునాయక్ హెచ్చరించారు. త్వరలో పేరెంట్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు, సూచనలు చేస్తామని డీటీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటిఓ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.