కోర్టుచౌరస్తా, జనవరి 10: హత్య కేసులో ఒకరికి జీవితఖైదు విధిస్తూ జిల్లా జడ్జి బీ ప్రతిమ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన రామంచ కుమారస్వామి మేస్త్రీ పని చేసేవాడు. ఇతడికి హనుమకొండ జిల్లా ల్యాడల్ల గ్రామానికి చెందిన శ్రీలతతో వివాహమైంది. కొద్ది రోజుల తర్వాత కుమారస్వామి పని మానేసి.. మద్యానికి బానిసై భార్యను వేధించసాగాడు. దాంతో ఆమె తల్లిగారింటికి వెళ్లింది. పెద్ద మనుషులను తీసుకొని వస్తేనే నీ భార్యను పంపిస్తామని అత్తింటివారు చెప్పడంతో అప్పటి సర్పంచ్ భర్త వాసుదేవారెడ్డిని కలిశాడు.
పంచాయితీ పెట్టించమని కోరగా, అందుకు ఆయన ఒప్పుకోలేదు. దీంతో వాసుదేవరెడ్డి కుటుంబంపై కుమారస్వామి కక్ష పెంచుకున్నాడు. 2023 డిసెంబర్ 4న సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో వాసుదేవరెడ్డి ఇంటికి కుమారస్వామి వెళ్లాడు. ఇంటి ముందు ఒంటరిగా కూర్చున్న వాసుదేవరెడ్డి తల్లి మట్ట లక్ష్మిని కుమారస్వామి కత్తితో పొడవగా ఆమె చనిపోయింది. వాసుదేవరెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజకుమార్ కేసు నమోదు చేయగా, సీఐ కిశోర్ దర్యాప్తు జరిపారు. సీఎంఎస్ తిరుపతి, ఏఎస్ఐ శ్రీనివాస్ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూలూరు శ్రీరాములు విచారించారు. జడ్జి సాక్ష్యాధారాలను పరిశీలించి.. నిందితుడు కుమారస్వామికి జీవితఖైదుతోపాటు 2వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.