Singareni | గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ వన్ పరిధిలోని జీడికే 11 గని లో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గని పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో జీ శ్రీకాంత్ అనే బదిలీ వర్కర్ కార్మికుడు గాయాలపాలయ్యాడు. గనిలోని 50వ లెవెల్ లో గని పై కప్పు కొంత భాగం కూలడంతో శ్రీకాంత్ కు మెడపై గాయమైంది. అతడిని హుటాహుటిన గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
బదిలీ కార్మికుడు శ్రీకాంత్ కు ప్రాణాపాయం తప్పినప్పటికీ మెడ పై గాయం కావడంతో ఆయనకు డాక్టర్లచే మంచి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన కార్మికుడిని గుర్తింపు కార్మిక సంఘం నాయకులు బ్రాంచ్ కార్యదర్శి ఆరెళ్లి పోచం, వైస్ ప్రెసిడెంట్ మదన మహేష్, పిట్ కార్యదర్శి శంకర్, సాయన్న, సంతోష్ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.