కరీంనగర్ రాంనగర్, ఆగస్టు 18 : కరీంనగర్ నగరపాలక సంస్థలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కలకలం రేగింది. కొంతమంది వచ్చి టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫైల్స్ తనిఖీ చేస్తుండగా.. ఏం జరుగుతుందో తెలియక కాసేపు అయోమయం నెలకొన్నది. చివరకు వచ్చింది అవినీతి నిరోధక శాఖ అధికారులు అని తెలియడంతో.. ఏసీబీ రైడ్ అనే చర్చ మొదలైంది. ఎవరినో లంచం తీసుకుంటున్న క్రమంలో పట్టుకున్నారనే ప్రచారం జరిగింది. చివరకు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫైల్స్ తనిఖీ చేయడానికి వచ్చినట్లు తెలియడంతో అందరూ చల్లబడ్డారు. కరీంనగర్ నగరపాలక సంస్థలోని టౌన్ విభాగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి టౌన్ విభాగంలో ప్రత్యేక తనిఖీలు చేశారు.
నగర పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు ఇస్తున్న అనుమతులపై విచారించారు. నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్లు ఇస్తున్నట్లు కొందరు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే కాగా, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి తీసుకున్న చర్యలపైనా ఆరా తీశారు. రాత్రి 10 గంటల వరకు అక్కడే సోదాలు చేసి, వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన అనుమతుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. త్వరలో పూర్తి స్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడిలో కరీంనగర్ ఏసీబీ రేంజ్ డీఎస్పీ మహేందర్రెడ్డి, ఇన్స్పెక్టర్లు తిరుపతి, ప్రేంకుమార్ పాల్గొన్నారు.