కరీంనగర్ కలెక్టరేట్, జూలై 21 : ఆధార్ కార్డులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. తండ్రి, భర్త పేరుతోపాటు పుట్టిన తేదీ కూడా తొలగిస్తూ, కేవలం పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే కార్డుల్లో నమోదు చేస్తున్న ట్లు, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ నెల 18 నుంచే అమల్లోకి రాగా, ఇకనుంచి కొత్త ఆధార్ నమోదులో తండ్రి, భర్త, పుట్టిన తేదీ, తదితర వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని యూఐడీఏఐ స్పష్టం చేసిందని తెలుపుతున్నారు. కేవలం 18 ఏళ్లలోపు పిల్లలకు సంబంధించిన కార్డుల్లో మాత్రమే కేరాఫ్ స్థానంలో తండ్రి పేరు ఉంటుందని ఉత్తర్వుల్లో ఉన్నట్టు చెబుతుండగా, పుట్టిన తేదీ స్థానంలో మాత్రం పుట్టిన సంవత్సరం ఉంటుందని, ఆధార్ అప్డేట్ చేసుకునే వారికి కూడా ఈ మార్పుల కనుగుణంగా కార్డులు అందుతాయని అధికారులు తెలిపారు.
చిన్న పిల్లల ఆధార్ అప్డేట్ చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఉడయ్ కొత్త నిర్ణయం తీసుకున్నది. పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అప్డేట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తున్నది. ఐదేళ్లలోపు పిల్లలకు వేలి ముద్రలు లేకుండానే ఆధార్ కార్డు జారీ చేస్తున్నారు. ఐదేళ్ల అనంతరం విధిగా కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉండగా, అంతగా పట్టించుకోవడం లేదు. చిన్ననాటి ఫొటోతో ఉండి, వేలిముద్రలు లేకపోవడంతో పలు సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారి వేలిముద్రలు సేకరించేందుకు బయోమెట్రిక్ యంత్రాలను నేరుగా వారి వద్దకే పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సాధ్యమైనంత తొందరగా వేలిముద్రలు సేకరించి, కార్డులు అప్డేట్ చేయనున్నట్లు తెలుస్తుండగా, ఐదేళ్లలోపు వారికి మాత్రం ఉచితంగా, దాటిన వారికి 100 రుసుంతో కొత్తకార్డులు అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.