Unique company | కోల్ సిటీ, జూలై 21: నెలకు రూ వెయ్యి ప్రీమియం కడితే… ఐదేళ్లకు లకారం వస్తుందని చెబితే.. పాపం బాధితులు కష్టమో. నష్టమో భరిస్తూ కూలీనాలి చేసుకొని కూడబెట్టుకున్న సొమ్మును ఆ సంస్థ ఎజెంట్ల చేతిలో పెట్టారు. తీరా ఐదేళ్లు గడిచాక… పాలసీ డబ్బులు ఇవ్వమని అడిగితే… ఉలుకు పలుకు లేదు. దీంతో తాము మోసపోయామా..? అని బాధితులు లబోదిబోమంటున్నారు. అయితే అలాంటి సంస్థ ఒకటుందనీ, అందులో ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లకు రెట్టింపు డబ్బులు వస్తాయని నమ్మబలికిన ఏజెంట్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో గల యూనిక్ మెర్కాంటైల్ ఇండియా ప్రై.లి సంస్థ ఆరేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలో బ్రాంచ్ లు ఏర్పాటు చేసింది. దాదాపు 2 వేల మంది ఏజెంట్లను నియమించుకుంది.
ఆ సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఐదేళ్లకు 60 శాతం అదనంగా డబ్బులు వస్తాయని నమ్మబలికింది. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు రూ.వెయ్యి చొప్పున ఐదేళ్ల పాటు చెల్లిస్తే రూ.లక్ష వరకు పాలసీ వస్తుందని చెప్పారు. దీంతో ఏజెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో తిరుగుతూ అనేక మందిని చేర్పించారు. పెద్దపల్లి, జగిత్యాల, గోదావరిఖని, మంచిర్యాల, శ్రీరాంపూర్, చెన్నూరు, మంథని తదితర ప్రాంతాలలో వందల సంఖ్యలో ఆ సంస్థలో డిపాజిట్లు కడుతూ వచ్చారు. ఇక ఐదేళ్లు గడిచాక ఆ సంస్థ ప్రతినిధుల నుంచి స్పందన లేదు. దీంతో డిపాజిట్టాదారులు ఏజెంట్ల మీద ఒత్తిడి తీసుకవస్తున్నారు. ఇక లాభం లేదనుకొని జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి తదితర ప్రాంతాలకు చెందిన కొంతమంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ నుంచి గుజరాత్లోని ఆ కంపెనీ ప్రతినిధులకు నోటీసులు కూడా పంపించినట్లు తెలిసింది. ఆ కంపెనీ ఏజెంట్లను కమిషనరేట్ కు పిలిపించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంతోపాటు పక్కనే ఉన్న మంచిర్యాల, చెన్నూరులో వందల సంఖ్యలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. జనం సొమ్ముకు ఎసరు పెట్టారని తెలుసుకొని లబోదిబోమంటున్నారు. ఐతే తాము చెల్లించిన ఏజెంట్ల వెంటపడుతున్నారు. దీంతో కంపెనీ ప్రతినిధులను కలిసేందుకు ఏజెంట్లు గుజరాత్ కు వెళ్లినట్లు తెలిసింది. ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లించిన డిపాజిట్ దారులకు మరో రెండు నెలల్లో 50 శాతం డబ్బులు వస్తాయని ఏజెంట్లు చెబుతున్నారు. కంపెనీ ప్రతినిధులు ఎవరికీ అందుబాటులోకి రాకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఇంతకీ ఆ కంపెనీ బోర్డు తిప్పేసిందా..? లేక ఇందులో ఏమైనా మతలబు ఉందా..? పోలీస్ ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో కూపీ లాగితే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా కరీంనగర్ లోని ఆ కంపెనీ ప్రతినిధిని సంప్రదించగా డిపాజిట్ దారుల డబ్బుల చెల్లింపులు నిలిచిపోయిన మాట నిజమేననీ, అదే విషయమై కంపెనీ అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు.