Gangadhara | గంగాధర, నవంబర్ 3 : ఇంటిలో ఒంటరిగా ఉంటున్న మెడలోని పుస్తెలతాడు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటన గంగాధర మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గంగాధర మండలంలోని కోట్లనర్సింహులపల్లి గ్రామానికి చెందిన వేమజాల సత్తవ్వ మహిళకు భర్త, పిల్లలు లేరు. దీంతో ఆమె ఒంటరిగా ఉంటూ గ్రామంలో కూలీ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతోంది.
ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సత్తవ్వ ఇంటికి వచ్చి అమ్మ తలుపు తీయండి అంటూ పిలిచారు. సత్తవ్వ తలుపు తీయకపోవడంతో బలవంతంగా తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్లారు. బెదిరించి ఆమె మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. సత్తవ్వ కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. బాధితురాలు సత్తవ్వ సోమవారం ఉదయం గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. సంఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.