పిల్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తల్లి కాఠిన్యం చూపింది. రెండేళ్ల క్రితం భర్తతో విడిపోయి మరొకరితో ఉంటున్న ఆ మహిళ, తన ఇద్దరు ఆడబిడ్డలను అనాథలుగా నమ్మించి అమ్మినట్టు తెలుస్తున్నది. ఇటీవల మెట్పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్‌నకు యత్నించిన ఉదంతంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
మెట్పల్లి, ఆగస్టు 16: విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పోతంగల్‌కు చెందిన లావణ్యకు, అదే జిల్లా సారంగాపూర్‌కు చెందిన ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు బిడ్డలు. ఒకరికి ఆరేళ్లు, మరొకరికి మూడేళ్లు. లావణ్య దాదాపు రెండేళ్ల కిందట తన భర్తతో విడిపోయి, ఇద్దరి పిల్లలతో కలిసి ఎడపల్లిలో ఉంటున్నది. అక్కడ బంధువుల ఇంకి వచ్చి పోయే ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటకు చెందిన ఇస్లావత్ నగేశ్ (32)తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం నుంచి అతడితో కలిసి మెట్‌పల్లిలోని ఓ చావిడి ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నది. పట్టణంలోని ఓ టిఫిన్ సెంటర్లో క్లీనర్‌గా పనిచేస్తున్నది.
మొదటి భర్తతో కలిగిన సంతానం భారమని భావించిందో.. లేదా వదిలించుకోవాలనుకున్నదో.. డబ్బులు పోగేసుకుందామన్నదో తెలియదు గానీ, ఆ ఇద్దరు ఆడపిల్లలపై కర్కశత్వం చూపింది. ప్రియుడితో కలిసి బిడ్డలను అమ్మాలని అనుకున్నది. అనాథలని నమ్మించి మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామంలో ఒకరికి ఆరేళ్ల బాలికను 2 లక్షలకు, మెట్పల్లి పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెంది న ఒకరికి మూడేళ్ల బాలికను 1.50 లక్షలకు గత జూన్‌లో అమ్మినట్టు తెలిసింది.
ఇదే క్రమం లో బాబు కావాలని ఒకరు అడగగా.. 1.50 లక్షలకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. ఆమె పథకం ప్రకారం.. ఈ నెల 13న నగేశ్ మెట్పల్లి దుబ్బవాడలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ చేసి దొరికిపో యాడు. కిడ్నాప్, పిల్లల విక్రయంపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతుండగా, ఇద్దరు బిడ్డలను అమ్మిన విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది.
జల్సాలకు అలవాటైన నగేశ్ డబ్బుల కోసం క్రమంగా దొంగగా, కిడ్నాపర్‌గా మారాడు. మొద ట పేకాట బానిసై, డబ్బుల కోసం అడ్డదారులు తొక్కాడు. రైతులు కల్లాల వద్ద నిల్వ చేసుకున్న పసుపు, ఇతరత్రా పంట ఉత్పత్తులను, బైక్‌లను ఎత్తుకెళ్లి అమ్ముకునేవాడు. గంజాయి కూడా విక్రయించేవాడు. చైన్ స్నాచింగ్ చేసేవాడు. పలు చోరీల కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడు. తన భర్త దొంగ అని తెలిసి మూడేళ్ల క్రితం నగేశ్ భార్య విడాకులిచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే భర్తతో విడిపోయిన లావణ్యతో నగేశ్ ఉంటు న్నాడు. అయితే ఈ నెల 13న బాలుడిని కిడ్నాప్ చేసి అడ్డంగా దొరికి పోయాడు.