Singareni | గోదావరిఖని : సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మారు పేర్లు విజిలెన్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి తలపెట్టిన ధర్నాను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు భారీ కుట్రలకు దిగారు. అయినా వాటన్నిటినీ ఛేదిస్తూ సింగరేణి కార్మికులు జీఎం కార్యాలయం ముందు ధర్నాను గ్రాండ్ సక్సెస్ చేశారు. శనివారం ఉదయం 8 గంటల నుండి గోదావరిఖని 5 ఇంక్లైన్ నుండి తలపెట్టిన ధర్నాను అడ్డుకోవడానికి పోలీసులు పథకం రచించి బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో బంధించారు.
ధర్నాకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి ఇంటిని శనివారం తెల్లవారుజామున నిర్బంధించి ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. తనను నిర్బంధించిన ధర్నా ఆగదని ఉదయం 11:30 ప్రాంతంలో ధర్నా కొనసాగుతుందని కౌశిక్ హరి మీడియాతో శనివారం ఉదయం స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ శ్రేణులు అర్జీ-1 జీఎం కార్యాలయం ముందు ధర్నాకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే రామగుండం లోని తన ఇంట్లో నిర్బంధించబడ్డ కౌశిక్ హరి పోలీసుల కళ్లు కప్పి సింగరేణి ఆర్జీ-1 జీఎం కార్యాలయానికి చేరుకున్నారు.
అప్పటికే ధర్నాకు వందలాది మంది రావడం కౌశిక్ హరి అక్కడకు రావడంతో కార్మికుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఈ సందర్భంగా వందలాది మంది బీఆర్ఎస్ టీబీజీకేఎస్ శ్రేణులు కార్మికులు సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కారుణ్య నియామకాలను రద్దు చేసే చర్యలను విరమించుకోవాలని, మారుపేర్ల కార్మికుల సమస్యను పరిష్కరించాలని, విజిలెన్స్ పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి వారికి ఉద్యోగాలు కల్పించాలని, సింగరేణిలో అవినీతి అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. సంస్థను కాపాడాలని ప్లే కార్డుల ద్వారా భారీ నినాదాలు మార్మోగాయి. ధర్నా సందర్భంగా కౌశిక్ హరి సింగరేణి అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఇదిలా ఉంటే ధర్నాకు ముందుగానే శనివారం తెల్లవారుజామున గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు అటు శ్రీరాంపూర్ నుంచి వచ్చే నాయకులను ఇతర చోట్ల ముఖ్య నాయకులను పోలీస్ స్టేషన్లో బంధించి వందలాది మంది పోలీసులు ధర్నా జరగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శ్రీరాంపూర్ కు వస్తున్నాడని పేర్కొంటూ ముందస్తు అరెస్టులు చేసిన మెడికల్ బోర్డు సమస్య ప్రధాన సమస్య కావడంతో ఎవరు అడ్డుకున్నా ధర్నా ఆగలేదు.
భారీ నిర్బంధమున్నా.. ధర్నా సక్సెస్ : కౌశిక్ హరి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
సింగరేణి మెడికల్ బోర్డు సమస్యతోపాటు విజిలెన్స్ కేసులు మారుపేర్ల సమస్యపై తాను తలపెట్టిన ధర్మాను పోలీసులు ఎంత నిర్బంధించిన ఆగలేదు. సింగరేణి కార్మికుల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల రోజురోజుకు అసహనం పెరుగుతుంది దీనికి నిదర్శనమే ఎవరు అడ్డుకున్నా ధర్నాకు వందలాది మంది తరలివచ్చారు. సింగరేణిలో కేసీఆర్ హయాంలో దాదాపు 19వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తే వాటిని కొనసాగకుండా చేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు చేపట్టిన ఆందోళనలో భాగంగానే తాను ధర్నాకు పిలుపునిస్తే వందలాదిమంది పోలీసులను పెట్టి అడ్డుకునేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేసి కారుణ్య నియామకాలను అమలు చేయాలి.