ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక ఎన్నికల నగరా ఎట్టకేలకు మోగినా పల్లెల్లో మాత్రం సందడి కరువైంది. రాజకీయ కోలాహలమే లేకుండాపోయింది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతున్నా ఎటుచూసినా నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తున్నది. రిజర్వేషన్ల అంశం కోర్టుకు చేరడంతో చాలా రోజులుగా పోటీచేయాలని తహతహలాడుతున్న నాయకులు, కార్యకర్తల్లో స్తబ్దత నెలకొన్నది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన కీలక నేతలు, ప్రజాప్రతినిధులే ఎలక్షన్లు ఉంటాయా..? ఉండవా..? అన్న సందిగ్ధంలోకి పడిపోవడంతో కాంగ్రెస్‌లో జోషే లేకుండా పోయింది. ప్రతిపక్ష బీఆర్ఎస్లో మాత్రం నయా ఉత్సాహం కనిపిస్తున్నది. నిత్య సమావేశాలతో శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నది.
జగిత్యాల, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికలకు గత నెల 29న షెడ్యూల్ విడుదల చేసినా.. పల్లెల్లో మాత్రం పెద్దగా సందడి కనిపించడం లేదు. రిజర్వేషన్ల అంశం హైకోర్టులో ఉండడంతో ఎన్నికలపై అయోమయం వీడడం లేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు, షెడ్యూల్ విడుదలై దాదాపు వారం గడుస్తున్నా, ఎక్కడా జోష్ కానరావడం లేదు. యూరియా కొరత నేపథ్యంలో మొన్నటి వరకు రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతూ వచ్చింది. దీనికి తోడు అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందన్న భావం ప్రజల్లో కనిపించింది.
ఈ నేపథ్యంలో అసలు ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్లేది? అన్న భావం పార్టీ కేడర్‌లో వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం, రిజర్వేషన్లు ఏవీ కూడా కేడర్‌కు అనుకూలంగా లేకపోవడంతో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్మథనంలో పడిపోయారు. దాదాపు ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపినా.. అనుకూలమైన రిజర్వేషన్లు రాకపోవడంతో మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్‌లు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇప్పుడు రిజర్వేషన్లకు అనుగుణంగా కొత్త క్యాడర్‌ను సన్నద్ధం చేయాల్సిన పరిస్థితి ఉండగా, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జిలు ఏ మండలం నుంచి ఎవరిని బరిలోకి దింపాలి? అన్న విషయమై సమాలోచనలు చేస్తున్నారు.
రిజర్వేషన్లపై తలనొప్పి.. ఓ నేత క్లారిటీ!
జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు తారుమారు కావడంతో ద్వితీయ శ్రేణి నాయకులు మీమాంసలో పడిపోయారు. ముందుకు వెళ్లాలా..? వద్దా..? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జిలు కావాలనే కీలక క్యాడర్‌కు జడ్పీటీసీ, ఎంపీపీలుగా అవకాశం రాకుండా చక్రం తిప్పి, రిజర్వేషన్లు మార్చారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ రిజర్వేషన్ల ప్రక్రియ జగిత్యాల జిల్లాలో కీలక బాధ్యతలో ఉన్న నేతకు తలనొప్పిగా మారినట్టు తెలిసింది. ఒక మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్, తమ మండల జడ్పీటీసీ స్థానం రిజర్వేషన్ కేటగిరిలోకి వెళ్లడంపై కీలక నేతపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు పార్టీకి రాజీనామా చేసే వరకు వెళ్లినట్టు తెలిసింది. అలాగే కొన్నేళ్లుగా కీలక నేతకు ఆర్థికబలంతోపాటు అన్ని విధాలా సాయం చేసిన ఇద్దరు రెడ్డి సామాజిక నాయకులు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది.
తమ మండలం రెండుగా విభజించబడిందని, తాము పోటీ చేసేందుకు ఏ ఒక్కటి అనుకూలమైన రిజర్వేషన్ లేకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అసంతృప్తి వ్యక్తం చేసిన నాయకుడితోపాటు ఇద్దరు రెడ్డి సామాజిక నేతలను జిల్లాకు చెందిన ఓ ప్రధాన అధికారి వద్దకు తీసుకెళ్లి, రిజర్వేషన్ల అమలులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పించినట్టు సమాచారం.
అలాగే ఎన్నికలు అసలు జరిగే అవకాశం లేదని, 42 శాతం బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని న్యాయస్థానం అడ్డుకుంటుందని, కోర్టు ఆదేశాల తర్వాత మరోసారి రిజర్వేషన్ల ప్రక్రియ చేపడతారని, అప్పుడు న్యాయం చేస్తానని చెప్పడంతోపాటు కోర్టులు జీవో 9ని కొట్టివేస్తాయన్న విషయాన్ని ఒక న్యాయనిపుణుడితో ఫోన్లో చెప్పించి శాంతింపజేసినట్టు తెలిసింది. అయితే ఈ విషయం బయటకు రావడంతో అసలు ఎన్నికలు జరుగుతాయా..? లేదా అన్న అనుమానంలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు పడిపోయారు.
జడ్పీ సీటు కోసం ప్రయత్నాలు!
ఓవైపు రిజర్వేషన్లపై అయోమయం కనిపిస్తున్నా.. మరోవైపు మాత్రం పదవులను ఎలా చేజిక్కించుకోవాలోనని ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. జగిత్యాల జడ్పీ పీఠాన్ని జనరల్ మహిళకు రిజర్వు చేయగా, ఆ స్థానాన్ని చేజిక్కించుకొనేందుకు అధికార పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. వరుసగా మూ డుసార్లు ఓటమి పాలైన అధికార పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి.. ఒక మండల జడ్పీటీసీ స్థానంతోపాటు తన సొంత మండలం సైతం జనరల్ కావడంతో అక్కడి నుంచి తనవాళ్లను పోటీ చేయించి, జడ్పీ సీటును కైవసం చేసుకునే ఆలోచన చేస్తున్నారని కార్యకర్తలు చెబుతున్నారు.
ఇక జిల్లాలోనే సీనియర్ నాయకుడు సైతం తన కుటుంబం నుంచి ఒకరిని జడ్పీ పదవిలో కూర్చోబెట్టాలని తన అంతరంగికులతో చర్చించినట్టు తెలుస్తున్నది. తన కుటుంబీకురాలితోపాటు ఓ వైద్యుడి భార్యను బరిలోకి దించితే ఎలా ఉంటుందని విచారించినట్టు సమాచారం. ఇక జిల్లాలో కీలక నాయకుడు సైతం ఓ నాయకుడి బంధువును జడ్పీ చైర్పర్సన్ చేయాలన్న ఆలోచన చేసినట్టు తెలిసింది. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే సైతం తన వర్గానికి చెందిన వారికి జడ్పీటీసీ టికెట్లతోపాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టేందుకు వ్యూహం పన్నుతున్నట్టు సమాచారం. తాను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తన వెంట ఉన్న ముగ్గురు జనరల్ కేటగిరికి చెందిన నాయకుల్లో ఒకరికి అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం
అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అలకలు కొనసాగుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం జోష్ కనిపిస్తున్నది. ఇప్పటికే జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఉన్న నాయకులతో ప్రధాన నాయకులు, సమావేశాలు నిర్వహించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజాక్షేత్రంలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని, బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుందన్న ఆశాభావం క్యాడర్లో వ్యక్తమవుతున్నది.
జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఇద్దరు నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల వ్యూహాన్ని రూపొందించారు. అలాగే ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాల్లోను మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు వ్యూహం రూపొందించారు.