Godavarikhani | కోల్ సిటీ, జనవరి 14: ఈనెల 15 నుంచి నాగపూర్ లో జరగనున్న కోలిండియా సాంస్కృతిక పోటీలకు ఎంపికై బయలుదేరి వెళ్తున్న రామగుండం రీజీయన్ కళాకారులకు బుధవారం గోదావరిఖనిలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటీవల మందమర్రిలో జరిగిన కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీల్లో లైట్ సాంగ్ విభాగంలో దార సుశీల, మౌతర్గన్ విభాగంలో ఆదిల్ మొహమ్మద్, కవాలి టీం విభాగంలో సాన జలపతి, పులియాల సతీశ్, పొన్నాల శంకర్, శ్యామ్, కనకం రమణయ్య, రాకేశ్, ప్రేమ్ కుమార్ లు ప్రథమ బహుమతులు సాధించి కోలిండియా పోటీలకు ఎంపికైన విషయం విధితమే.
ఈమేరకు బుధవారం నాగపూర్ కు బయలుదేరి వెళ్తున్న కళాకారులను సీనియర్ కళాకారులు స్థానిక సీఈఆర్ క్లబ్ లో శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కోలిండియా స్థాయి పోటీల్లో రాణించి సింగరేణి సంస్థకు, ఈ ప్రాంతంకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కళాకారులకు ప్రోత్సాహమే విజయం వైపు నడిపిస్తుందన్నారు. అలాగే ఇటీవల మంచిర్యాలలో జరిగిన లఘుచిత్ర పోటీల్లో జ్యురీ బహుమతి సాధించిన ‘అలా వృద్ధాశ్రమంలో” లఘుచిత్ర నిర్మాత సతీశ్ కుమార్, దర్శకుడు చంద్రపాల్ చేతుల మీదుగా అవార్డును, మెమెంటోను అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ కళాకారులు కవ్వంపల్లి స్వామి, ఏరియా సూపర్వైజర్ హనుమాన్ దాస్ రమేష్, కాసిపాక రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.