చందుర్తి, ఏప్రిల్ 14: చిన్న సన్నకారు రైతుల సౌకర్యార్థం నాబార్డ్ సేవ్స్, గ్రామ పంచాయతీ సహకారంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో పల్లె సంత (గ్రామీణ మార్కెట్) ఏర్పాటు చేసింది. రైతులకు గిట్టుబాటు ధర, మారెటింగ్ కల్పించడంతోపాటు దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు గానూ 2022లో దాదాపు పది గుంటల్లో కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారి పక్కన గ్రామ శివారులో పనులు ప్రారంభించింది. నాబార్డ్ సేవ్స్ నిధులు 15లక్షలు, గ్రామ పంచాయతీ నిధులు 2.50లక్షలు, మాజీ సర్పంచ్ దప్పుల లక్ష్మి సొంత ఖర్చులు 3లక్షలతో పల్లె సంతనిర్మాణ పనులు ఏడాదిలోనే పూర్తి చేసింది. అయితే ఆ తర్వాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో దీనిపై నిర్లక్ష్య కొనసాగింది.
అప్పటి నుంచి నేటి వరకు గ్రామీణ మార్కెట్ వినియోగంలోకి రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన మార్కెట్‌ను ఇలా వదిలేయడం ఏంటని మండిపడుతున్నారు. మార్కెట్ ప్రారంభమైతే కూరగాయలు, ఆరుతడి పంటలు పండించే చిన్న, సన్న కారు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేసున్నారు.
మార్కెట్ ప్రారంభమైతే కూరగాయలు, ఆరుతడి పంటలు పండించే చిన్న, సన్న కారు రైతులకు ఎంతో ఉపయోగపడుతది. దళారీ వ్యవస్థ బాధ కూడా ఉండదు. రైతులకు దూరభారం, రవాణాభారం తుగ్గుతుంది. అధికారులు వెంటనే వినియోగంలోకి తేవాలి.
– ఆకుల ఎల్లయ్య, రైతు (లింగంపేట)