Door-to-Door Fever Survey | కోల్ సిటీ, జూలై 14: వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా నగర పాలక సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ అన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ ప్రజారోగ్య విభాగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే చేయాలని సూచించారు.
సర్వే సమయంలో పారిశుధ్య సమస్యలు దృష్టికి వస్తే సమన్వయం కోసం ఇరు విభాగాల సిబ్బంది ఫోన్ నంబర్లతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ దవాఖాన, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో అనుమానిత కేసులు వస్తే ఆ సమాచారం ఇస్తే వారి ఇంటి పరిసరాల్లో నివారణ చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. అన్న ప్రసన్నకుమారి మాట్లాడుతూ అంటువ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. మున్సిపల్ శాఖను సమన్వయం చేసుకుంటూ వ్యాధులు విజృంభించకుండా అరికడుతామన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, వైద్యులు మణికేశ్వర్ రెడ్డి, సాదిక్ పాషా, అహల్య, పద్మ, రమణి, దీవెన, స్నేహలత, నగర పాలక శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, కిరణ్, కుమారస్వామి, జూనియర్ అసిస్టెంట్ శంకర్ స్వామి, మెప్మా టీఎంసీ మౌనిక, జవాన్లు పాల్గొన్నారు.