Siricilla | రుద్రంగి, జూలై 03: రుద్రంగి మండల కేంద్రంలో పల్లె పకృతివనం సమీపంలో అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. మండల కేంద్రంలో పల్లె పకృతివనం సమీపంలో అటవీప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని మృతిచెందగా గొర్లకాపరులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్ సంఘటన స్థలానికి పోలీస్ సిబ్బందితో కలిసి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం ఆడ, మగనా గుర్తించే పరిస్థితి లేకుండా కుళ్లిపోయిన స్థితిలో ఉందన్నారు. ఫొరెన్సిక్ నిపుణులకు సమాచారం అందించి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదిక అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.