Former MLA Manohar Reddy | పెద్దపల్లి రూరల్ నవంబర్ 21 : ప్రస్తుతం సమాజంలో ఉద్యోగాలు బాగానే ఉన్నాయని, అవకాశాలు చాలా వస్తాయని, వాటిని అందుకునే విధంగా ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్ ను సొంతం చేసుకోవచ్చని ట్రినిటీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ట్రినిటి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఆగమనం 2025 పేరుతో ఫ్రెషర్స్ డే ను శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మనోహర్ రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులంతా నేటి బాలలే రేపటి బావిభారత పౌరులుగా ఎదిగేందుకు సన్నద్దం కావాలన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో మీరు నేర్చుకున్న స్కిల్స్ విద్యతోనే ఉన్నత శిఖరాల వైపు అడుగులు పడుతాయన్నారు. ఫీజు రీ ఎంబార్స్ మెంట్ విషయంలో ఉన్న నిబంధనలను అనుసరిస్తూ మంచి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. హాజరు శాతం మార్కుల శాతానికి ఫీజీ రీ ఎంబర్స్ మెంట్ కు ముడిపెట్టిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బందులకు లోను కాకుండా తల్లిదండ్రులపై పేద కుటుంబాలపై భారం పడకుండా చూసుకోవాలన్నారు.
పిల్లల విషయంపై తల్లి దండ్రులు గొప్పగా చెప్పుకునేలా ప్రతీ ఒక్కరూ ఎదుగాలన్నారు. పెద్దపల్లి జిల్లాలో సకల సౌకర్యాలు కల్గిన అటానమస్ కళాశాలగా ఈ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉన్న కళాశాల పేరు, తల్లిదండ్రుల పేరు నిలబెట్టేలా ఉన్నత ఆశయంతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా జూనియర్ లకు సీనియర్ లు స్వాగతం పలుకుతూ చేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమ నృత్యాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ , ప్రిన్సిపాల్ డాక్టర్ మణిగణేష్, హెచ్వోడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.