Godavarikhani | కోల్ సిటీ, జూలై 24 : నీడనిచ్చిన భారీ పురాతన చెట్లలో ఒకటి నేలమట్టం చేసిన సంఘటన గోదావరిఖినిలో వివాదానికి దారితీసింది. నగరంలోని ప్రధాన చౌరస్తాలో గల పోచమ్మతల్లి దేవాలయంకు నీడగా ఉన్న దాదాపు 70 యేళ్లకు పైబడి నాటి భారీ వృక్షంను గురువారం సాయంత్రం భారీ యంత్రాలతో కూల్చివేశారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు, భక్తులు అక్కడకు చేరుకొని ప్రతిఘటించడంతో తాను ప్రైవేటు కాంట్రాక్టర్ అని అధికారులు పంపిస్తే వచ్చానంటూ పొంతనలేని సమాధానం చెబుతూ జారుకున్నారు. కాగా, చౌరస్తాలోని పోచమ్మ ఆలయం వద్ద రెండు భారీ వృక్షాలు 70 యేళ్ల నాటి నుంచి ఎంతో మందికి నీడనిస్తున్నాయి. అందులో ఒకటి రావి చెట్టును భక్తులు త్రిమూర్తుల స్వరూపంగా కొలుస్తూ పోచమ్మ తల్లి ఉత్సవాల సమయంలో ముడుపులు కడుతుంటారు.
ఈ చెట్ల కింద అనాథ వృద్ధులు, నిరాశ్రయులు సేద తీరుతుంటారు. ఈ నేపథ్యంలో గురువారం ఆలయ అభివృద్ధికి సంబంధించి నమూనాను స్థానిక ఎమ్మెల్యే, మేయర్ ఆవిష్కరించారు. త్వరలోనే ఆలయాన్ని ఆధునీకరిస్తున్నట్లు ప్రకటించారు. కొద్ది గంటల వ్యవధిలోనే ఒక ప్రైవేటు కాంట్రాక్టర్ కూలీలతో వచ్చి భారీ యంత్రం సాయంతో చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు. ముందుగా ఒక పురాతన వేప చెట్టును యంత్రాలతో పూర్తిగా తొలగించారు. అనంతరం పక్కనే ఉన్న పూజనీయమైన రావి చెట్టును సైతం కూల్చివేసేందుకు ఉపక్రమించగా, స్థానికులు ప్రతిఘటించారు. ఎవరు కూల్చమన్నారంటూ నిలదీయగా, అధికారులు పంపిస్తే వచ్చామని బదులిచ్చారు.
ఆందోళనకర వాతావరణం నెలకొనడంతో సదరు కాంట్రాక్టర్ రావి చెట్టు కూల్చివేతను ఆపివేసి అక్కడ నుంచి జారుకున్నాడు. ఆలయ అభివృద్ధికి తామేం వ్యతిరేకం కాదనీ, కానీ 70 యేళ్ల నాటి ఈ వృక్షాలను ఆషాఢ మాసంలో కూల్చివేయడం అరిష్టమని స్థానికులు పేర్కొంటున్నారు . మొన్నటికి మొన్న నగరంలోని దారి మైసమ్మ గుళ్లను కూల్చివేసిన సంఘటన గుర్తు చేస్తూ.. ఇప్పుడు చౌరస్తాలోని పోచమ్మ ఆలయంలో గోదావరిఖని ప్రజలకు, భక్తులకు తరతరాలుగా నీడనిస్తున్న చెట్లను కూల్చివేస్తారా..? అంటూ హిందూ, ధార్మిక సంఘాల నాయకులు, స్థానికులు ఖండిస్తున్నారు. ఇక్కడితో ఆగకుండా రావి చెట్టును కూడా కూల్చివేస్తే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు.