కరీంనగర్, జనవరి 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కలెక్టరేట్ : కరీంనగరానికి తలమానికంగా నిలవనున్న కేబుల్ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తికాగా, తుది దశ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. బ్రిడ్జిపై నిర్దేశించిన మేరకు బరువు ఆపే విషయంపై గతంలోనే అధికారులు లోడ్ టెస్టింగ్ చేయగా అది సంపూర్ణంగా విజయవంతమైంది. దీంతో ఈ వారధిని అనుసంధానిస్తూ, రెండువైపులా 47.3 కోట్లతో చేపట్టిన అప్రోచ్ రోడ్ల నిర్మాణం కూడా చివరిదశకు చేరుకున్నది. 6.5కోట్లతో ఏర్పాటు చేయనున్న డైనమిక్ లైటింగ్, మరో 2 కోట్లతో నిర్మించనున్న సర్వీస్ రోడ్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్రోచ్ రోడ్ల పనులు పూర్తైన వెంటనే ఈ పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్వరాష్ట్రంలో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మొట్టమొదటి భారీ తీగల వంతెన కావడంతో ఆ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కూలీల వెంటనే ఉంటూ నిర్మాణ పనులకు ముడిసరుకు మిశ్రమ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మించిన ఈ వంతెనపై ఎంత బరువు మోసే వాహనాలైనా సులువుగా వెళ్లేలా వెయ్యి టన్నులకు పైగా సామర్థ్యంతో నిర్మించారు.
కమాన్‌నుంచి హౌసింగ్‌బోర్డు మీదుగా సదాశివపల్లిని తాకుతూ వరంగల్ ప్రధాన రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణంతో కరీంనగర్ – వరంగల్ మధ్య 7 కిలోమీటర్లకు పైగా దూరం తగ్గడంతోపాటు ప్రస్తుతం మానేరునది బ్రిడ్జిపై ఉన్న ట్రాఫిక్ సమస్యకు కూడా తెర పడనున్నది. ఇప్పటివరకు దేశంలో రెండు ప్రాంతాల్లోనే ఇలాంటి బ్రిడ్జిలు ఉండగా, తాజాగా తెలంగాణలోనే రాష్ట్ర ప్రభుత్వం రెండు చేపట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన వంతెన పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుండగా, మానేరు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తై, ప్రారంభిస్తే కరీంనగర్ పర్యాటక ప్రాంతంగా మారనున్నది. అలాగే, ఇది వినియోగంలోకి రాగానే దక్షిణాదిలోనే అతిపెద్ద తీగెల వంతెనగా గుర్తింపు తెచ్చుకోనుంది. అత్యుత్తమ సామర్థ్యం కలిగిన ఈ వంతెన ఇప్పటికే ఔట్‌స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్ -2021 అవార్డును కూడా సొంతం చేసుకున్నది.
లైటింగ్, సర్వీస్ రోడ్ల పనులు మాత్రమే పెండింగ్
సందర్శకులను ఆకట్టుకునేలా రాత్రివేళల్లో రంగు రంగుల వెలుగులతో మెరిసిపోయేలా డిజిటల్ డైనమిక్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసేందుకు 6.5 కోట్లు కేటాయించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వెలుగులు ఉండాలని సీఎం కేసీఆర్ సూచించగా, అందుకనుగుణంగా డిజైన్లు రూపొందించి పంపినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అలాగే, సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు 2 కోట్లు కేటాయించగా, అప్రోచ్ రోడ్లపై బీటీ పనులు పూర్తికాగానే మొదలు పెట్టనున్నారు. కేబుల్ బ్రిడ్జిని అనుసంధానం చేసే అప్రోచ్ రోడ్ల పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కరీంనగర్‌వైపు 200 మీటర్ల వరకు పూర్తికాగా, మరో 30 మీటర్ల క్లోజింగ్ వాల్ పనులు కొనసాగుతున్నాయి. సదాశివపల్లి వైపు 520 మీటర్ల అప్రోచ్ రోడ్డు పని ముగిసింది. ఫినిషింగ్ వర్క్ పూర్తయింది. బీటీ వేసేందుకు ఫార్మేషన్ పనులు నడుస్తున్నాయి.
రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా, పూర్తికాగానే బీటీ పనులు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరో పక్షం రోజుల్లో మిగిలిన పనులు పూర్తి చేసి, ట్రయల్ రన్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. వీలైనంత తొందరగా అన్ని పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని మంత్రి గంగుల ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు యంత్రాంగం సైతం పనులు కొనసాగిస్తుండగా.. మరికొద్ది రోజుల్లోనే కరీంనగర్‌కు ప్రత్యేకాకర్షణగా నిలిచే కలల వారధి సస్పెన్షన్ బ్రిడ్జి అందుబాటులోకి రానున్నది.