పెద్దపల్లి, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రామగుండం బీ థర్మల్ ప్రాజెక్టు స్థానంలోనే సింగరేణి, జెన్కో సంయుక్తంగా 8 వేల కోట్లతో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ విద్యుత్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రామగుండంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన బీ థర్మల్ పవర్ ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌తో కలిసి ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి, జెన్కో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం గోదావరిఖని చౌరస్తాలోని సెక్టార్ 2వద్ద 3 కోట్లతో నిర్మించిన నైపుణ్య కేంద్రం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమృత్ 2.0 టీయూఎఫ్డీఐసీ కింద చేపట్టే పలు అభివృద్ధి పనులు, సింగరేణి ఆధ్వర్యంలో 5 కోట్లతో 23 కిలోమీటర్ల అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రామగుండంలో 800 మెగా వాట్ల పవర్ ప్లాంట్ నిర్మిస్తామని ప్రకటించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించి తొందరగా ప్రతిపాదనలు పంపితే అంతే తొందరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి శుక్రవారం సీఎంతో చర్చించి ఆమోదింపజేసుకొని సూత్ర ప్రకటనకు నిర్ణయించామన్నారు. 1971లో ఏర్పాటుచేసిన రామగుండం ఆర్టీఎస్ బీ బ్లాక్ 50 ఏళ్లపాటు సేవలు అందించిందని, సాంకేతిక కారణాలతో దానిని మూసి వేయాల్సి వచ్చిందని, దీనితో స్థానిక ప్రజలకు ఉన్న భావోద్వేగాలను గుర్తించి ఇకడే పవర్ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించామన్నారు. సింగరేణి కార్మికులకు కోటి, కాంట్రాక్ట్ కార్మికులకు 30 లక్షల బీమా కల్పించామన్నారు.
రాష్ట్రంలో 2031 నాటికి గరిష్ఠంగా 27, 059 మెగావాట్లు, 2034-35 నాటికి 31, 809 మెగావాట్ల పైగా విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, థర్మల్, సోలార్, హైడల్, పంప్ స్టోరేజ్, ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు చేస్తామని, విద్యుత్ సర్ప్లస్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. పీఎం కుసుమ్ కింద రాష్ట్రంలో మరో నాలుగు వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ఇందులో మహిళా సంఘాలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోరిక మేరకు పాలకుర్తి ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తామని, సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల అంశాన్ని పరిశీలించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని, అవసరమైన చోట అదనపు ట్రాన్స్ ఫార్మర్, సబ్ స్టేషన్, విద్యుత్ పోల్స్ మంజూరు చేస్తామని, ఆర్అండ్ఆర్ సమస్యల పరిషారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఒక నెల రోజుల లోపు 100 మందికి ఉపాధి కల్పించే రూరల్ టెక్నాలజీ సెంటర్ అనే సాఫ్ట్ వేర్ సంస్థను రామగుండంలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సుల్తానాబాద్ వద్ద కూడా రూరల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు పదెకరాల స్థలం గుర్తించామని, సింగరేణి ఆధ్వర్యంలో సిల్ సెంటర్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ జరుగుతుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు గోదావరిఖని పట్టణంలోని సింగరేణి ఖాళీ స్థలాన్ని సేకరించి మొదటి సంవత్సరం 3500 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందిస్తామని, దీనిని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో సింగరేణి ప్రాంతంలో 20 వేల మంది కార్మికులకు పట్టాలు పంపిణీ చేశామని, మరో నాలుగైదు వేల మంది భూములు రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రామగుండం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర ప్రత్యేకమైందన్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరిన విధంగా ఈ ప్రాంతానికి త్వరలోనే అదనంగా బస్సులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం 211 మహిళా సంఘాలకు 23 కోట్ల 35 లక్షల 50 వేల బ్యాంకు లింకేజీ రుణాల చెకులను డిప్యూటీ సీఎం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజ్ఠాకూర్మక్కాన్ సింగ్, చింతకుంట విజయరమణారావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, ప్రేమ్‌సాగర్‌రావు, రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ, జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్, ఆర్డీవోలు బీ గంగయ్య, వీ హనుమానాయక్ పాల్గొన్నారు.