అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్క తేలింది. పూర్వ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 77.26 శాతం పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటింగ్ శాతం తగ్గింది. ఒక్క హుస్నాబాద్ మినహా పన్నెండు నియోజకవర్గాల్లోనూ తగ్గుదల కనిపించింది. ప్రధానంగా పట్టణవాసుల కంటే గ్రామీణ ఓటర్లే అత్యధికంగా ఓటుహక్కును వినియోగించుకోవడం కనిపించింది. మరోవైపు అంతటా మహిళా చైతన్యం వెల్లివెరిసింది. రెండు మూడు నియోజకవర్గాలు మినహా ప్రతి నియోజకవర్గంలోనూ వారే ఎక్కువగా ఓటు వేసినట్లు స్పష్టమైంది.
– కరీంనగర్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా, శుక్రవారం పూర్తి స్థాయి లెక్క తేలింది. 2018లో జరిగిన ఎన్నికల్లో 79.45 శాతం నమోదు కాగా, ఈ సారి ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల పరిధిలో 77.26 శాతం ఓటింగ్ జరిగింది. గతంతో పోలిస్తే 2.19 శాతం తగ్గింది. 2018 ఎన్నికల సమయంలో 27,86,918 మంది ఓటర్లు ఉండగా, అప్పుడు 22,14,452 ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తాజా ఈ ఎన్నికల్లో 31,78,980 మంది ఓటర్లకు 24,56,146 మంది ఓటు వేశారు. అందులో ప్రధానంగా పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్లే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు పురుషులను మించి మహిళలు ఓటు వేశారు. రెండు మూడు నియోజకవర్గాలు మినహా ప్రతి నియోజకవర్గంలోనూ వారే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.