తాము అధికారంలోకి వస్తే విద్యారంగానికి పెద్దపీట వేస్తామంటూ హామీనిచ్చిన కాంగ్రెస్, ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా.. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులపై నిర్లక్ష్యం చూపుతున్నది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల యజమాన్యాల సంఘం నిరవధిక బంద్‌కు పిలుపునివ్వగా, విద్యాలయాలన్నీ సోమవారం నుంచి మూతపడ్డాయి. విద్యాసంవత్సరం మధ్యలో ఈ పరిణామాలు తలెత్తడంతో శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో దాదాపు 40వేల మంది డిగ్రీ, పీజీ విద్యార్థులపై ఈ ప్రభావం పడుతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కళాశాలలనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న యాజమాన్యాలు, అలాగే బోధన, భోదనేతర సిబ్బందికి వేతనాలు అందక రోడ్డున పడే ప్రమాదమున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి సారించి.. విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలువాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వస్తున్నది. ఇటు ఈ విషయంలో ఇప్పటికే విసిగివేసారిన యాజమాన్యాలు ప్రభుత్వంతో తాడేపేడో తేల్చుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి.
కరీంనగర్, అక్టోబర్ 14 (నమస్తేతెలంగాణ ప్రతినిధి)/ కమాన్‌చౌరస్తా : నిరుపేద విద్యార్థులకు సైతం ఉన్నత విద్యను అందించాలన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో చేరుతున్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించిన విధానాన్ని స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు కూడా కొనసాగించింది. 2014లో అధికార పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆనాటి నుంచి 2021 వరకు ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిస్థాయిలో చెల్లిస్తూ వచ్చింది. ఆ తర్వాత ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రత్యేక దృష్టి సారించడం, వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం వంటి ప్రాధాన్యాల నేపథ్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో 2021 నుంచి కొంత జాప్యం జరిగింది. నిజానికి కరోనా వంటి అత్యంత క్లిష్ట సమయంలోనూ ఆనాటి బీఆర్ఎస్ సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ చేసి విద్యార్థులకు అండగా నిలిచింది. తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లోనూ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా విద్యారంగంపై చిన్నచూపు చూడకుండా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చేసింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ గెలిచి అధికారంలోకి వస్తే, ఈసారి విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని కేసీఆర్ ముందుగానే ప్రకటించారు. అయితే, ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఎన్నికలకు ముందు విద్యారంగానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చూస్తే కండ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. విద్యారంగానికి సంబంధించి తన మేనిఫెస్టోలో 36కు పైగా హామీలు ఇచ్చింది. అందులో ప్రధానంగా ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని ప్రకటించింది. ప్రతి విద్యార్థికీ ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పిస్తామని చెప్పింది. ఇంకా మెరుగైన రీతిలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రైవేట్ రంగంలో ఉన్న అన్ని విద్యాసంస్థల్లో ప్రమాణాలు, నాణ్యతను పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇలా ఉన్నత విద్యారంగానికి సంబంధించి దాదాపు 36 హామీలు ఇచ్చినా, ఆచరణలో మాత్రం చూపలేకపోయింది.
ఈ విద్యా సంవత్సరంతో మొత్తం మూడు సంవత్సరాల ఫీజు రీయింబర్స్మెంట్ ప్రైవేట్ విద్యాలయాలకు రావాల్సి ఉందని యజమానులు చెబుతున్నారు. 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని కోరుతూ రాష్ట్ర అసోసియేషన్ పలుసార్లు కాంగ్రెస్ మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసింది. ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చింది. మొత్తం పాత బకాయిలు ఒకేసారి చెల్లించలేకపోయినా ముందుగా 500 కోట్లు విడుదల చేస్తే.. తమ తమ కళాశాలలను ముందుకు నడుపుతామని విన్నవించింది. ఇచ్చే 500 కోట్లతో కళాశాలలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయని, తద్వారా బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని వాస్తవ పరిస్థితిని పలుసార్లు ప్రభుత్వ పెద్దల ముందు పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలిపేందుకు రాష్ట్ర కమిటీ ప్రయత్నం చేసినప్పటికీ ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వ పెద్దలతో చేసిన ప్రయత్నాలు విఫలం కావడం.. ఇదే సమయంలో కళాశాలలు నడుపడం భారంగా మారడంతో చాలా కళాశాలల్లో ఐదారు నెలలుగా బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వని దుర్భర పరిస్థితి ఉన్నది. నిజానికి ఏటా అందుకోసం కేటాయించిన బడ్జెట్, ఆ మేరకు జిల్లాలకు, అక్కడి నుంచి ఆయా శాఖలకు కేటాయింపులు జరగడం వంటివి గతంలో జరిగాయి. సంబంధిత శాఖల ఆదేశాల మేరకు జిల్లా ట్రెజరీ అధికారులు ఆన్లైన్లో టోకన్ నంబర్లు జనరేట్ చేసి సంబంధిత కళాశాలలకు సమాచారం ఇచ్చారు. కానీ, చివరకు రాష్ట్ర ఆర్థిక శాఖ పేమెంట్లకు క్లియరెన్స్ ఇవ్వక పోవడంతో అన్లైన్లో టోకెన్లను తీసుకున్న నేటికీ ప్రయోజనం లేకుండా పోయింది. డబ్బుల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా, యజమాన్యాలకు నేటికి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు అందడం లేదు.
ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఆర్థికంగా చితికిపోతున్న కళాశాలల యాజమాన్యాలు, సోమవారం నుంచి నిరవధిక మూసివేతకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లు, విజ్ఞప్తులపై ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక మూసివేతకు వెళ్తామంటూ రాష్ట్ర, జిల్లాల నాయకత్వాలు పలుసార్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసినా సర్కారు పెడచెవిన పెట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీళాశాలలు సోమవారం నుంచి మూత పడ్డాయి. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేదు. ఈ పరిణామాలు ఉమ్మడి జిల్లాలో సుమారు 40వేల మంది విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయి. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో 65 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, 35 వరకు పీజీ కళాశాలలున్నాయి. వీటిలో 40 నుంచి 50వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో 95 శాతానికిపైగా విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కింద చదువుతున్నారు. విద్యాసంవత్సరం సగంలో ఈ పరిస్థితులు తలెత్తడం వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం-యజమాన్యాల మధ్య నడుస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం.. తమ భవిష్యత్‌కు ప్రమాదకరంగా మారుతున్నదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం దిగి రాకపోతే.. తాడో పేడో తేల్చుకునేందుకు యాజమాన్యాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి.
తప్పని పరిస్థితుల్లో మూసివేతకు రాష్ట్ర అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నది. మా ఉద్దేశం విద్యార్థులను ఇబ్బంది పెట్టాలన్నది కాదు. ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే ఆర్థికంగా కళాశాలలు నిలదొక్కుకుంటాయి. ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేకపోతున్నాం. విద్యార్థులను అడిగే పరిస్థితి లేదు. మూడు నాలుగు నెలులు అంటే సర్దుబాటు చేసుకోవచ్చు. అలాగే బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు సర్దడానికి ఆస్కారం ఉంటుంది. కానీ, ప్రస్తుతం పరిస్థితి మా చేతులు దాటిపోయింది. మెజార్టీ కళాశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఓనర్లు తాళం వేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. అద్దెలు కట్టే పరిస్థితి అంతకన్నా లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకేసారి కాకపోయిన దశల వారీగా ఇవ్వాలని కోరుతున్నాం. ఒక వేళ స్పందించకపోతే మాత్రం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు.. భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతాం. తమ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహకరించాలని అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.