Godavarikhani | కోల్ సిటీ , మే 16: అనారోగ్యంతో అచేతన స్థితిలో భర్త… కూలీనాలి చేసుకుంటూ కుటుంబంను పోషించుకుంటున్న భార్య… ఇంజనీరింగ్ చదువుతూ ఇంటి అవసరాలకు రాగి జావా అమ్ముతున్న కూతురు… పదో తరగతి చదివి ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి న్యూస్ పేపర్ వేస్తున్నకొడుకు.. వెరసి అభాగ్యులైన ఆ కుటుంబంకు శ్రీ సీతారామ సేవా సమితి అండగా నిలిచింది. ఆ కుటుంబంకు తమవంతుగా 50 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులతోపాటు తక్షణ సాయంగా రూ.2500లు శుక్రవారం అందజేసి భరోసా ఇచ్చింది. గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన దుర్గం రాముకు భార్య రేణుక, పిల్లలు ఆశ్రిత, వంశీకృష్ణ ఉన్నారు. ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేస్తూ రెండేళ్ల క్రితం పక్షవాతంతో రాము మంచానికి పరిమితమయ్యాడు.
ఇక కుటుంబ భారంను తన భుజాన వేసుకొని అతని భార్య కూలినాలి పని చేస్తుంది. అమ్మకు చేదోడువాదోడుగా కూతురు ఆశ్రిత బీటెక్ చదువుతూ మరోవైపు రాగి జావ అమ్ముతుంది. ఇక పదో తరగతి చదివిన కొడుకు కూడా ఉదయాన్నే ఇంటింటికి తిరుగుతూ న్యూస్ పేపర్ వేస్తూ వచ్చిన ఆదాయంను అమ్మకి ఇస్తున్నారు. ఆ కుటుంబ దీనగాథను తెలుసుకున్న ఎన్టీపీసీకి చెందిన శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు చలించి శుక్రవారం 50 కిలోల బియ్యం, రెండు నెలలకు సరిపడ నిత్యవసర సరుకులు, రూ.2500 ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారు. సంస్థ అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంను ఆదుకునేందుకు మానవతా వాదులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక బాధ్యులు మద్దెల దినేష్, కంది సుజాత, జనగాం రాజేశ్వరి, లెనిన్, గౌస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.