Marijuana seized | తిమ్మాపూర్, జూన్16: ఒడిస్సా నుండి గంజాయి కొనుగోలు చేసి గంజాయిని తరలిస్తున్న ముగ్గురు యువకులను ఎల్ఎండీ పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్, ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం ముగ్గురు యువకులు వారి ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్నారని పక్కా సమాచారంతో పోలీసులు కొత్తపల్లి వద్ద తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ముగ్గురు యువకులు బైక్ పై వెళ్తుండగా వారి వద్ద తనిఖీలు చేయగా బ్యాగుల్లో 5 కిలోల గంజాయి లభించింది.
వారిని విచారించగా వేములవాడ మండలం నాగయ్య పల్లికి చెందిన గుంటి నగేష్, వేములవాడ పట్టణానికి చెందిన కుతాడి భరత్ కుమార్, కోనరావుపేట మండలం మట్టిమల్ల గ్రామానికి చెందిన చెప్పాల సాత్విక్ గా గుర్తించారు. వీరు కొద్దిరోజులుగా గంజాయి తాగుతూ బానిసయ్యారు. అలాగే గంజాయి అమ్మి ఈజీగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో నాలుగు రోజుల క్రితం ఒడిశా నుండి గంజాయి కొనుగోలు చేసి వారి బైక్పై వస్తుండగా పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. వారి వద్ద నుండి 5 కిలోల గంజాయిని సీజ్ చేయడంతో పాటు కేటీఎం బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా పట్ల కఠినంగా ఉంటామని సీఐ సదన్ కుమార్ తెలిపారు. ఎవరైనా తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.