వేములవాడ, ఏప్రిల్ 5 : ఇండియాలో ఉన్న వ్యక్తి తన అవసరాల నిమిత్తం సౌదీ నుంచి తెప్పించుకున్న బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తులే కొట్టేసిన వ్యవహారంలో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వేములవాడ ఏఎస్పీ శేషాద్రినీ రెడ్డి తెలిపారు. శనివారం వేములవాడ ఠాణాలో వివరాలు వెల్లడిం చారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు చెందిన రుద్ర రాంప్రసాద్ తన అవసరాల నిమిత్తం సౌదీ నుంచి గోల్డ్ తెప్పించుకోవాలని భావించాడు. సౌదీలో ఉన్న తన సమీప బంధువు రవీందర్‌ను సంప్రదించాడు. 400 గ్రాముల గోల్డ్ పంపించాలంటూ అందుకు అయ్యే డబ్బులు రూ.35లక్షలు ఇక్కడి నుంచే పంపించాడు. ఈ క్రమంలో రవీందర్ సౌదీలో తనతో పనిచేసే వేములవాడకు చెందిన కాలువ వెంకటేశ్‌ను కలిసి విషయం చెప్పాడు. చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన తొంటి బీరయ్య, గడ్డం అనిల్ ఇండియాకు వెళ్తున్నారని, వారితో పంపిద్దాం అని చెప్పి వెంకటేశ్ మధ్యవర్తిత్వం చేసి, రవీందర్ ద్వారా 400 గ్రాముల బంగారం బిసెట్లను వారికి అప్పగించాడు.
అయితే ఆ బంగారాన్ని కొట్టేసేందుకు వెంకటేశ్, బీరయ్య, అనిల్ స్కెచ్ వేశారు. విషయాన్ని ఇండియాలో ఉన్న వారి సమీప బంధువు ఏనుగుల నాగరాజుకు చెప్పారు. అనుకున్నట్లుగానే బీరయ్య, అనిల్ ఎయిర్‌పోర్టులో దిగగానే అప్పటికే అక్కడ ఉన్న నాగరాజుకు గోల్డ్ ఇచ్చి పంపించగా, అతను ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి కనిపించకుండా పోయాడు. అయితే తనకు ఇవ్వాల్సిన గోల్డ్‌ను మరొకరికి ఇచ్చారని రాంప్రసాద్ పోలీసుకుల ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు. బీరయ్య, అనిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు చెప్పారు. ఇందులో మొదటి నిందితుడు కాలువ వెంకటేశ్ సౌదీలో ఉండగా, నాలుగో నిందితుడు నాగరాజు ప్రస్తుతం కనిపించకుండా పోవడంతో పోలీసులు గాలిస్తున్నట్లు వివరించారు. విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారుల కన్ను కప్పి పెద్ద మొత్తంలో బంగారం తీసుకువచ్చిన వీరి వెనుక ఏదైనా ముఠా హస్తం ఉన్నదా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆమె వెంట పట్టణ సీఐ వీరప్రసాద్, సిబ్బంది ఉన్నారు.