ధర్మారం, నవంబర్17: దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్, పత్తిపాక గ్రామాల్లో ఆయన పర్యటించారు. పత్తిపాక సింగిల్ విండో అధ్వర్యంలో మల్లాపూర్‌లో నాబార్డు నిధులు రూ.25 లక్షలతో గోదాం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 68 మంది దళిత మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పత్తిపాకలో రూ.55 లక్షలతో నిర్మించిన ఐదు సీసీ రోడ్లను ప్రారంభించారు. ఇక్కడి ఎస్సీకాలనీలో దళితులతో మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో 40 లక్షల ఎకరాలకు సాగు నీరందుతున్నదని చెప్పారు.
ఫలితంగా భూముల ధరలు పెరిగాయని తెలిపారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ను సరఫరా చేస్తుంటే కేంద్రం మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నదని, అయినా తమ ప్రభుత్వం అడ్డుకుని రైతుల పక్షాన నిలబడిందని చెప్పారు. మల్లాపూర్‌లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న దళిత మహిళలు సహకార సంఘంగా రిజిస్ట్రేషన్ చేసుకుని టెండర్ల ప్రక్రియలో పాల్గొంటే ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, ఇతర పాఠశాలల విద్యార్థుల యూనిఫాంలు కుట్టడానికి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పల్లె ప్రగతితో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. అనంతరం ఆయన మల్లాపూర్ ఎస్సీకాలనీలో పర్యటించి చర్చిని సందర్శించారు. ఇక్కడ సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, కాలనీలో ప్రధాన దారిలో సీసీ రోడ్డుకు మరో రూ.5 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ కాలనీ మహిళల వినతిపై స్పందించిన మంత్రి తక్షణమే కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.
అర్హులైన దళితులకు ఇండ్ల కోసం స్థలం కేటాయించటానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గ్రామంలో యువత కోసం రీడింగ్ గది, విజ్ఞాన పుస్తకాలు సమకూర్చుతామని, ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి జిమ్ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, సర్పంచులు గంధం వరలక్ష్మీ-నారాయణ, బద్దం సుజాత-రవీందర్ రెడ్డి, ఎంపీటీసీలు భూక్య సరిత- రాజునాయక్, బద్దం అజయ్‌పాల్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మధుసూదన్ శర్మ, వరంగల్ డీఎస్పీ ఏదుల్ల కిషోర్ కుమార్, ఎంపీడీవో జయశీల, డీటీ మల్లారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు పూస్కూరు జితేందర్‌రావు, మిట్ట తిరుపతి, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు పూస్కూరు రామారావు, ఎగ్గెల స్వామి, విండో వైస్ చైర్మన్లు పసునూటి శ్రీనివాస్, సామంతుల రాజమల్లు, టీ(బీ)ఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు.