కదం తొక్కిన నియోజకవర్గ ఓటర్లు
సెగ్మెంట్ చరిత్రలో అత్యధిక పోలింగ్
ఉదయం నుంచే కేంద్రాలకు బారులు
ఎక్కడ చూసినా పోటెత్తిన ఓటర్లు
గంట గంటకూ పెరుగుదల ప్రశాంతంగా ముగిసిన ప్రక్రియ
ఫలించిన యంత్రాంగం శ్రమ
కరీంనగర్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణప్రతినిధి)/ కరీంనగర్, నమస్తేతెలంగాణ ; హుజూరాబాద్ నియోజకవర్గానికి శనివారం జరిగిన ఉప ఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో 84.39 శాతం పోలింగ్ జరుగగా ఈ సారి 86.33 శాతం నమోదైంది. ఉదయం రెండు గంటలపాటు పోలింగ్ కొంత మందకొడిగానే జరిగినా, ఆ తర్వాత మాత్రం వేగం పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం సమయంలో బాగా పెరిగింది. అధికారుల అంచనా ప్రకారం 85 శాతం పోలింగ్ అవుతుందని భావించినా.. సాయంత్రం వరకు అంతకు మించి నమోదైంది. మొత్తానికి చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియగా, అధికారయంత్రాంగం ఊపిరిపీల్చుకున్నది.
హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఓటర్లు పోటెత్తారు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో పెరిగిన ఓటింగ్ ఎవరికి వారే వారి ఖాతాల్లో వేసుకుంటూ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అధికారులు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. నిజానికి హుజూరాబాద్‌లో గతంలోనూ ఇతర నియోజకవర్గాలతో పోల్చితే పోలింగ్ అధికంగా జరిగేది. అదే చైతన్యాన్ని ఈసారి కూడా ఓటర్లు చూపించారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నియోజకవర్గంలో మొత్తం 2,37,022 ఓట్లు ఉండగా ఇందుల 1,17,922 మంది పురుషులు, 1,19,099 మంది మహిళలున్నారు. ఇతరులు ఒకరు ఉన్నారు.
ఊపిరి పీల్చుకున్న పోలీసులు..
చెదురుమదురు ఘటనలు మినహా హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో మూడు నెలల పాటు శ్రమించిన అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇల్లందకుంటలోని ఒక పోలింగ్ బూత్‌లో మొరాయించిన ఈవీఎంను పది నిమిషాల్లోనే టెక్నికల్ టీమ్ రెట్టిఫై చేయడం మినహా ఎక్కడా ఇలాంటి సంఘటనలు ఎదురు కాలేదు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక గోయల్ ఉప ఎన్నికను స్వయంగా పర్యవేక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. 86.33 శాతం పోలింగ్ నమోదు కావడంతో అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నిక కోసం 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,715 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించారు. 891 బ్యాలెట్ యూనిట్లు, 421 కంట్రోల్ యూనిట్లు, 515 వీవీ ప్యాట్స్ ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్కటి మినహా అన్ని సమర్థవంతంగా పనిచేశాయి. ఇక 3,865 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 కంపెనీల కేంద్ర పోలీసు బలగాలతో బందో బస్తు నిర్వహించారు. సీపీ సత్యనారాయణతోపాటు పలువురు పోలీసు అధికారులు బందోబస్తును పర్యవేక్షించారు.
పర్యవేక్షించిన ఉన్నతాధికారులు..
ఓటింగ్ సరళిని ఎన్నికల జిల్లా అధికారులతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్, సంయుక్త ఎన్నికల ప్రధాన అధికారి రవికిరణ్ స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఉదయం 7.20 గంటలకే హుజూరాబాద్ పట్టణంలోని కొత్తపల్లి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రంలో మాస్కులు లేకుండా వచ్చిన వారికి హెల్త్ డెస్కు నుంచి మాస్కులు ఇప్పించారు. మాస్కులు లేకుండా పోలింగ్ కేంద్రాలకు రానీయవద్దని, అలాంటి వారిని గుర్తించి వెంటనే మాస్కులు అందించాలని హెల్త్ డెస్కులో ఉన్న సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్, సంయుక్త ఎన్నిల ప్రధానాధికారి హుజూరాబాద్‌లోని జూనియర్ కళాశాల, బాలికల హైస్కూల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లను పరిశీలించి జిల్లా అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోందని శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ నుంచి జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కూడా శశాంక్ గోయల్ పరిశీలించారు.
గంటగంటకూ పెరుగుదల..
పోలింగ్ సరళి ఉదయం కొంత మందకొడిగా ఉన్నా గంట గంటకూ పెరిగింది. ప్రతి రెండు గంటకోసారి అధికారులు పోలింగ్ శాతాన్ని వెల్లడించారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 10.58 శాతం మాత్రమే నమోదైంది. ఉదయం మహిళలు ఎక్కువగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. అప్పటికీ 33.27 శాతం పోలింగ్ నమోదైంది. రెండు గంటల్లో 22.69 శాతం ఓటింగ్ పెరిగింది. కోతల సమయం అయినందున గ్రామాల్లో రైతులు ఎక్కువగా వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ రెండు గంటల సమయంలో కొంత మందకొడిగా సాగి 12.36 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రు. మధ్యాహ్నం 3 గంటల వరకు పో లింగ్ కొద్దిగా పుంజుకుంది. అప్పటికి 61.66 శాతం నమోదైంది. ఈ రెండు గంటల్లో 16.03 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు 76.26 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సమయంలో 14.06 శాతం మంది ఓటు వేశారు. సాయంత్రం 7 గంటల వరకు 86.33 శాతం ఓటింగ్ నమోదైంది. చివరి రెండు గంటల్లో 10.07 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం గా 86.33 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా..
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హుజూరాబాద్ ఉప ఎన్నికలో అధికారులు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో హెల్త్ అండ్ హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు. వీటిలో మాస్కులు, శానిటేషన్స్ అందుబాటులో ఉంచారు. థర్మా మీటర్లు వినియోగించి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రతి ఓటరుకు టెంపరేచర్ పరీక్షించారు. మాస్కులు లేని వారికి వాటిని సమకూర్చారు. ప్రతి ఓటరుకు శానిటేషన్ చేయించిన తర్వాతనే పోలింగ్ కేంద్రానికి పంపించారు. అంతకు ముందు ప్రతి పోలింగ్ కేంద్రంతో శానిటేషన్ చేయించారు. కొవిడ్‌తో బాధపడుతున్న వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి కేంద్రంలో పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య చివరి గంటలో ఓటు వేసేందుకు వీరికి అవకాశం కల్పించారు. అంతే కాకుండా ప్రతి కేంద్రంలో దివ్యాంగుల కోసం వీల్ చైర్లు, సహాయకులను అందుబాటులో ఉంచారు. వృద్ధులను, నడిచే అవకాశం లేని వారి కోసం ప్రతి కేంద్రంలో ఒక వాహనాన్ని కూడా సమకూర్చారు. ఈ ఏర్పాట్ల కారణంగానే హుజూరాబాద్ ఉప ఎన్నికలో గత సాదారణ ఎన్నికల కంటే ఈ సారి ఓటింగ్ శాతం పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.